Monday, November 10, 2008

వారాంతం - థీయేటర్లో బ్రెయిన్ ఈటర్

కేక సినిమాను గురించి చాలా మంది వాళ్ళ అభిప్రాయలను తమ, తమ బ్లాగుల్లో వ్రాసే ఉంటారు.. క్రింద చెప్పిన అభిప్రాయం కేవలం నా సొంత అనుభవం (అభిప్రాయం) మాత్రమే...

దిక్కుమాలిన వారాంతం (వీకెండ్) ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. వీకెండ్ వచ్చిందంటే చాలు తలకుమాసిన ప్రతీవాడు "హేయ్ .... వీకెండ్ ఏమీ చేస్తున్నావ్" అంటాడు. తలతిక్క, దిక్కుమాలిన... etc ప్రశ్న ఒక్క శుక్రవారం మాత్రమే వస్తే బాగుండేది... కానీ ఇది గురువారంతో మొదలై ... మళ్ళీ బుధవారానికి ముగుస్తుంది (పిచ్చోళ్ళారా... బుధవారానికి ముగుస్తుంది అంటే... వారానికి తగ్గ ప్రశ్న ముగుస్తుంది.. మళ్ళీ వచ్చే వారానికి మొదలవుతుంది). బుధవారం రోజు ఆఫీసులో అడుగుపెట్టినప్పటి నుండి మొదలవుతుంది ప్రశ్న... అదే ప్రశ్న మళ్ళీ వాడే మార్చి, మార్చి గురువారం, శుక్రవారం అడుగుతాడు.....

నేను వీకెండ్ ఏమి చేస్తానో వీడికి చెప్పాలా అనిపిస్తుంది. నాకు మటుకు... నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని కులు-మనలి కి వెల్తున్నా అని చెప్పాలని లేక పొతే.. ఇక్కడ softwareలో వచ్చే జీతం సరిపోవటం లేదు అందుకే... part time శెనెగలు, full time బటానీలు అమ్ముకోవాలి అని చెప్పాలని ఉంటుంది. ప్రశ్న అడగటంతో పని అయిపోయింది అనుకుంటే... మీరు Idlebrain.com లాంటి వాడి రేటింగు చూసి "చెత్త బంగారులోకం" సినిమా చూసినట్టే. వాడు ఏమి చేశాడో... వద్దు అని మనం చెవులు మూసుకున్నా, పని ఉంది అని లేని పనిని గుర్తుకు తెచ్చుకున్నా, వడలకుండా... వద్దన్నా వెంట పడి సినిమాల గురించి చెప్పే తెలుగు చానళ్ళ లాగా చెవులలో నుండి రక్తం వచ్చేలా చెప్పేస్తారు.

ఇలా వీళ్ళ బాధ తట్టుకోలేక నేను కూడా ఏదో ఒకటి చేసెయ్యాలని గట్టిగా "వచ్చే వారం నుండి నేను కూడా వీకెండ్ ఎంజాయ్ చేసి వీళ్ళకు పిట్ట కథలు... బుర్ర కథలుగా చెప్పాలి అని నేను రాసే కోడ్ మీద ఒట్టు ఒట్టు పెట్టుకున్నా... ఎమైందో ఏమో అప్పటి నుండి నేను రాసిన కోడ్ పని చెయ్యటం మానేసింది. అప్పుడు మా సిద్దుగాడు నాకు సహాయం చేస్తా అని మా RUM బ్యాచ్ ముందు.... పావలాకి రూపాయి యాక్టింగ్ చెయ్యటం మొదలెట్టాడు. అప్పుడు నేను "వద్దురా సిద్దు... సీనుగాడు, సిద్దుగాడు కలిసి కోడ్ రాస్తే... "బగ్గులు" రాలుతాయి..." అన్నాను. ఇంకేముంది... వీకెండ్ మనకు ఆఫిసులో మనకు దీపావళి, దసరా, రంజాను, క్రిస్టమస్ అన్నీ....

అలా నేను ప్రతిఘ్న చేసిన తరువాత వారం ఆఫిసులోనే గడిచిపోయింది. అందుకే నా ప్రతిఘ్నలో చిన్న సవరణ చేసి... దాని సారాంశం అంతా అలాగే ఉంచి ఒట్టు మాత్రం మా సిద్దుగాడు రాసిన కోడ్ మీద పెట్టాను. అప్పటి నుండి మా సిద్దుగాడికి దసరా, దీపావళి etc.... అది వేరే విషయం.

రెండవ వారం :

అదేంటో... నా ప్రతిఘ్న మహిమో మరి ఇంకా ఏంటొగానీ... మా "ఎడారికి ఎక్కువ సిటీకి తక్కువ ఐన" గుర్గావ్ లోని PVR వాడికి సడన్ గా మన తెలుగు హీరోలు అందరూ తెలిసిపోయారు... ఇంకేముంది నాకు తెలుగు సినిమాలు చూసే అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టుగా పట్టుకుంది.

శుక్రవారం ఇలా ఆఫీసు అయిపోగానే... శనివారం రోజు పొద్దున్నే PVRలో చూడబోయే తెలుగు సినిమా గురించి కల కంటూ నిద్రపోయాను. తెల్లవారుఝామునే 11 గంటలకి నిద్ర లేచి పళ్ళు కూడా తోముకోకుండా.. అలాగే సినిమాకి వెళ్ళిపోయాను. సినిమా పేరు "రక్ష". నేను పడే ఆవేశానికి తోడు... టికెట్ కౌంటరు దగ్గర ఉండే వాడు నన్ను జురాసిక్ పార్కు నుండి తప్పించు కొని వచ్చిన డైనోసారు అన్నట్టుగా చూసాడు. తిక్కెట్టుకు డబ్బులు ఇవ్వగానే... "మీరు చాలా అదృష్టవంతులు సార్!!! మీకు సీటు హాలు మధ్యలో దొరికింది" అన్నాడు. ఇదే ఆఖరి టిక్కెట్ట్ అన్నట్టుగా నాకు టిక్కెట్టు ఇచ్చాడు. నాకు మాత్రం సొనాలి బింద్రే లాంటి అమ్మాయితో డేటింగ్ దొరికినంత ఆనందపడిపోయాను. అలా టిక్కెట్టు తీసుకొని ఆడిటొరియం దగ్గరికి వెళ్ళే సరికి.... నా లాంటి నిర్భాగ్య, అభాగ్య జీవులు నాలుగైదు మాత్రమే ఉన్నాయి... అదే విషయం అక్కడ ఉండే వాడిని అడిగాను. " ఇది రాం గోపాల్ వర్మ సినిమా సార్.... ప్రేక్షకులు మెల్లి మెల్లిగా వస్తారు" అన్నాడు.

సినిమా మొదలైంది.... సినిమా పేరు "రక్ష" ... మీకు ఎప్పుడైనా చేతబడి జరిగిందా??? అనేది క్యాప్షను. సినిమా మొదలవగానే నేను నవ్వటం మొదలుపెట్టాను... నేను ఒక్కడినే నవ్వుతున్నానా లేక అందరు నవ్వుతున్నారా అని చుట్టూ చూసాను... నేను, నాతో పాటు...... నలుగురితో పాటు... నారాయణ అనుకునేట్టు...నలుగురు అంతే... వాళ్ళు కూడా పగలబడి నవ్వుతున్నారు. అప్పుడు నాకు "చేతబడి జరిగింది... రాం గోపాల్ వర్మ కి అందుకే... "రక్ష" లాటి సినిమా తీసాడు... వీడికి నా మీద ఎందుకంత కక్ష???" అనిపించింది.

సినిమా మొత్తంలో భయపడింది జగపతి బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి మాత్రమే.... నాకు ఐతే మాంచి కామేడి సినిమా చూసిన ఆనందం మిగిలింది.

మూడవ వారం :

చేతబడి చేయబడ్డ రాం గోపాల్ వర్మ సినిమా నుండి తేరుకునే లోపల మళ్ళీ వీకెండ్ వచ్చింది.
సారి మా PVR వాడికి నచ్చిన సినిమా... కేక.
సినిమాని చూడవద్దని నా ఆరో ప్రాణం అరిచింది. అలా అరిచిన నా ఆరోప్రాణానికి నా మనసు "విశ్వ విఖ్యాత దర్శకుడు తేజ గారు "చిత్రం, నువ్వు-నేను, జయం, ఒక 'V' చిత్రం లాంటి కళా"ఖండా"లను మన మీదికి వదిలారు. మనం అలాంటి వాళ్ళను ఆదుకోవాలి" అని నోరు నొక్కేసి... ఎనస్థీషియా ఇచ్చేసాను. ఐనా నా పర్సులో ఉన్న Rs.300కు పోగాలం దాపురించినపుడు ఎవడు మాత్రం ఆపగలడు??

పోయిన సారి ఐన అనుభవంతో టిక్కెట్టు దొరకగానే కొరివి దయ్యానికి కొబ్బరి దొరికినట్టుగా సంభరపడి పోకుండా ఆడిటోరియంలోకి వెళ్ళాను. సారి కొద్దిగా నాలాంటి అభాగ్య జీవాలు ఉన్నాయి. సినిమా మొదలవగానే ఒకటే... విజిల్స్, చప్పట్లు.... ఇక్కడ ఉన్న జనానికి వచ్చే సౌండ్ కి మాత్రం పొంతన లేకపోయేసరికి... నా ప్రక్కన కూర్చున్న వాడిని చూసాను.. వాడు టేప్ రికార్డర్ లో చప్పట్లు, విజిల్స్ ని రికార్డ్ చేసుకొని వచ్చి థియేటర్ లో ప్లే చేస్తున్నాడు.

అది చూసి నేను మీరు తేజ గారికి మంచి అభిమాని అనుకుంటాను అన్నాను.
అప్పుడు
అతను " అవును.. నేను తేజగారికి విపరీతమైన అభిమానిని. ఆయన తీసే సినిమాలు "కత్తి". అసలు అతను పెట్టే సినిమా పేర్లే వింతగా ఉంటాయి. ఆయన లాగా సినిమాలు మన తెలుగు ఇండస్టరిలో ఎవరూ తియ్యలేరు...".

అతనిని మాట్లాడిస్తే తేజ గురించి ఒక రోజు మొత్తం మాట్లాడేలా ఉన్నాడు అనుకొని... "సార్... నన్ను కొంచెం నన్ను సినిమా చూడనిస్తారా???" అన్నాను.
"
ఏంటండీ ... మీరు మరీను... సినిమాకు వచ్చేది సినిమా గురించి మాట్లాడుకోవటానికేగా... సినిమా చూడటానికి వచ్చినట్టుగా మాట్లాడుతారేంటి మీరు... " అన్నాడు.

"ఏంటీ... సినిమా థీయేటర్ కి వచ్చేది సినిమా చూడటానికి కాదా???? సినిమా గురించి మాట్లాడుకోవటానికా... ఎంత గొప్పగా చెప్పావు రా బాబు" అనుకున్నాను.

"అసలు హీరో సెలక్షను చూడండి... ఎంతగా సహజత్వానికి దగ్గరగా ఉన్నాడో..." అంటూ ఒక దిక్కిమాలిన జుట్టుపోలిగాడిని చూపిస్తూ.. "అవునండీ... మీరు చెప్పేదాకా అతను నాకు హీరో అనిపించలేదు. సినిమాలో అడుక్కున్నే
బిచ్చగాడేమో అనుకున్నాను. ఎంతగా సహజత్వానికి దగ్గరగా ఉందో..." అన్నాను.

"చూసారా... ఇలాగ హీరో సెలక్షను, సినిమాని ఇన్ని మలుపులు తిప్పటం తేజగారికే సాధ్యం.. అందుకే పొద్దుటినుండి ఇది మూడోసారి చూడటం..." అన్నాడు.

"అవునండీ... చాలా గొప్ప సెలక్షను, గొప్ప మలుపులు. ఇంక ఎంత సేపు నలుపుతారండీ నన్ను" అన్నాను.

"మీకు హాస్యచతురత కొంచెం ఎక్కువే అనుకుంటాను" అన్నాను.

నేను పడే బాధ మీకు కామెడీగా ఉందా నాయనా... అనుకున్నాను.

సినిమా intervalలో నా సీటు మార్చుకుందామని చూసాను... కానీ నాలాంటి అభాగ్య జీవులు చాలా మంది సినిమాకి రావటం వల్ల నాకు అదృష్టం లేకుండా పోయింది. సినిమా నడుస్తున్నంత సేపు తేజ తీసిన ఒక్కో కళా"ఖండా"లను గురించి మార్చి, మార్చి... మళ్ళీ మళ్ళీ, తిప్పి తిప్పి చెప్పాడు. నా కాలేజీ రోజులలో మా లెక్చరర్ చెప్పే విషయాలను కూడా ఇంతసేపు నేను ఎప్పుడూ వినలేదు.

సినిమాకి వెళ్ళి నేను పెట్టిన చావు, గావు కేక మా ఎడరి ప్రాంతం మొత్తం వినిపించింది. సినిమా వల్ల నాకు మిగిలిన ఆస్థి.... తలనొప్పి, రెండు Zandu Balm డబ్బాలు + Rs.300 క్రెడిట్ కార్డు బిల్లు అదనం.

ఐనా.....ఇంటి దగ్గర... కృష్ణ మంచిగా డ్యాన్స్ చేస్తాడా లేక జగపతి బాబు మంచిగా డ్యాన్స్ చేస్తాడా???, శోభన్ బాబు ఇద్దరు భార్యల ముద్దుల భర్త పొజిషను కి replacement జగపతి బాబేనా??? అనే ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక మాంద్యానికి కారణాలైన సమస్యల గురించి మా సిద్దుగాడు ప్రసంగించే సభలకు పోకుండా తప్పించుకుందామని అనుకున్న నాకు ఇలా జరగవసిందే...

నా కష్టాలు సరేలేండీ... ఇంతకు మీరు వీకెండ్ ఏమి చేశారు???

3 comments:

రాధిక said...

:)అయితే ఆ మహానుభావుడెవరో మీకు కేకపెట్టే చాన్సు కూడా ఇవ్వలేదన్న మాట :)

Sujata M said...

manchi pani ayindi. subramgaa tini paDukoakunDaa - sinimaa anTea elaa ? nenu haappee gaa inTloanea unnaa gaa !!! :D

లక్ష్మి said...

meeru cinema chudakundane keka pettesaru kada vadi nasa ki, jebu ki padd chillu ki, tala ki vachina noppi ki :))

nenu enchakka intlo kurchuni hindi channels vaallu vetiki vetiki maree mukummadiga vesina govinda cinemalu choosa :)