Friday, June 26, 2009

ఇంతకీ.... నేను వదిలిన అక్షరం ఏదీ????


పోయిన వారం మా కోతుల గుంపులో తెలుగు భాష గురించి చర్చ జరిగింది. దాని మధ్యలో మా సంతు గాడు.... "మీవి అన్నీ వట్టి మాటాలేరా... సరి ఐన తెలుగు రాని మీకు తెలుగు గురించి మాట్లాడే అర్హత లేదు. తెలుగు వ్యవహారిక, గ్రాంధికం లో ఎవరికీ అంత ప్రావీణ్యం లేదు" అన్నాడు.

వాడు అన్న మాటకు నాకు చాలా అవమానం అనిపించి తెలుగు దేశంలో, తెలుగు వారింట పుట్టి, తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు రాదు అనిపించుకొంటిని. ఛ.. ఇంత అవమానం తరువాత.. మనుటయా.... లేక మరణించుటయా అని ఆలోచించి... మరణించుటయే అని డిసైడ్ అయ్యి ప్రాయోపవేశానికి సిద్దం అయ్యాను.

సంతు గాడి మాటలు విన్న మా సాగర్ గాడికి బ్లడ్ బాయిలింగు పాయింటు దాటినట్టుంది. అంతే... "ఒరేయ్ సీనుగా!!!! ఆగాగు" అన్నాడు. "సంతుగా!!!!! ఏమంటివి... ఏమంటివి..... తెలుగు భాష నెపమున మన సీను గాడికి పాండిత్యము లేదందువా... ఎంత మాట ... ఎంత మాట. ఇది తెలుగు భాషా పాండిత్యమునకు సంబంధించిన పరీక్షయే గాని ఇంక దేనిది కాదే. కాదు... తెలుగు భాషా పాండిత్యమునకు సంబంధించిన పరీక్షయే అందువా.. అట్లైన.... వాడు చదివిన సుమతీ శతకం, వేమన శతకం ఏ భాషలోనివి. తెలుగులోనిది కాదా. నాతో చెప్పింతువేమిరా.... ప్రతి రోజు చదివే ఈనాడు పేపరు తెలుగులోనిది కాదా. ఇంత ఏల.... వాడు వ్రాసే బ్లాగు పోస్టులు తెలుగులోనివి కాదా. కాగా నేడు వాడి తెలుగు పాండిత్యమును గురించి వ్యర్థవాదమెందులకు" అన్నాడు.

సాగర్ గాడు చెప్పిన మాటకు నాకు ధైర్యం వచ్చి.... నా ప్రాయోపవేశాన్ని పెండింగులో పెట్టాను (ప్రాయోపవేశం అంటే ఏమిటి అని నన్ను అడగొద్దు. అడిగినా నేను చెప్పను. కావాలంటే... 9వ తరగతి తెలుగు పుస్తకంలో "ధుర్యోధనుడి ప్రాయోపవేశం" అనే పాఠం చదువుకోండి).

అప్పుడు సంతు గాడు "నాయనా సాగర్!!!!! తెలుగు రాయటం, చదవటం వచ్చినంత మాత్రాన తెలుగులో పండితులు కాలేరు. అచ్చులు, హల్లులు, గుణింతాలు చక్కగ వచ్చినవారు, తప్పులు లేకుండా అక్షరాలు రాసే వారు పండితులు, పాండిత్యం కలవారు అని నా అభిప్రాయం" అన్నాడు.

అప్పుడు సాగర్ గాడు "ఓహో.... అటులన.... అచ్చులు, హల్లులు మరియు గుణింతాలలో ప్రావీణ్యమా పాండిత్యానికి అర్హతను నిర్ణయించునది.... ఐతే మన సీనుగాడి చేత నేడు గుణింతాలలో మొదటిది ఐన "క" గుణింతము రాయించి నీ చేత సీను గాడు పండితుడు, తెలుగు భాష యందు పాండిత్యం కలవాడు అనిపించెదను. సోదరా ప్రవీణ్... Reynolds కలమును, స్వచ్చమైన తెల్ల కాగితమును వేగముగ తెమ్ము. సతీష్, పోటికి సంబంధించిన ఏర్పాట్లు చేయుము. మిలిగిన స్నేహితులారా మన సీను గాడిని పోటీకి ప్రోస్తహించి వీర తిలకమును దిద్దుడు. ఈ ఎడారి ప్రాంతమందున, సకల స్నేహితుల మధ్యమున, సర్వధ, శతధ, శతధ సహస్రధ మన సీనుగాడికి తెలుగులో పాండిత్యము లేదు అను మాటను శాశ్వతముగా ప్రక్షాలన గావించెద" అన్నాడు.

అప్పుడు ..... ఆ పోటిలో నేను రాసినది చూసి మా సంతు గాడు.... క్రింద పడి మరీ నవ్వి, నవ్వి..... నవ్వి. ఇంకేదో తక్కువ అయ్యింది అన్నాడు.

"క, కా, కి, కీ, కు, క్కు, కూ, కె, కే, కై, కృ, కౄ, కొ, కో, కౌ, క్క, కఁ, కః".
ఇంతకీ నేను వదిలిన అక్షరం ఏదీ????

Monday, November 10, 2008

వారాంతం - థీయేటర్లో బ్రెయిన్ ఈటర్

కేక సినిమాను గురించి చాలా మంది వాళ్ళ అభిప్రాయలను తమ, తమ బ్లాగుల్లో వ్రాసే ఉంటారు.. క్రింద చెప్పిన అభిప్రాయం కేవలం నా సొంత అనుభవం (అభిప్రాయం) మాత్రమే...

దిక్కుమాలిన వారాంతం (వీకెండ్) ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు. వీకెండ్ వచ్చిందంటే చాలు తలకుమాసిన ప్రతీవాడు "హేయ్ .... వీకెండ్ ఏమీ చేస్తున్నావ్" అంటాడు. తలతిక్క, దిక్కుమాలిన... etc ప్రశ్న ఒక్క శుక్రవారం మాత్రమే వస్తే బాగుండేది... కానీ ఇది గురువారంతో మొదలై ... మళ్ళీ బుధవారానికి ముగుస్తుంది (పిచ్చోళ్ళారా... బుధవారానికి ముగుస్తుంది అంటే... వారానికి తగ్గ ప్రశ్న ముగుస్తుంది.. మళ్ళీ వచ్చే వారానికి మొదలవుతుంది). బుధవారం రోజు ఆఫీసులో అడుగుపెట్టినప్పటి నుండి మొదలవుతుంది ప్రశ్న... అదే ప్రశ్న మళ్ళీ వాడే మార్చి, మార్చి గురువారం, శుక్రవారం అడుగుతాడు.....

నేను వీకెండ్ ఏమి చేస్తానో వీడికి చెప్పాలా అనిపిస్తుంది. నాకు మటుకు... నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని కులు-మనలి కి వెల్తున్నా అని చెప్పాలని లేక పొతే.. ఇక్కడ softwareలో వచ్చే జీతం సరిపోవటం లేదు అందుకే... part time శెనెగలు, full time బటానీలు అమ్ముకోవాలి అని చెప్పాలని ఉంటుంది. ప్రశ్న అడగటంతో పని అయిపోయింది అనుకుంటే... మీరు Idlebrain.com లాంటి వాడి రేటింగు చూసి "చెత్త బంగారులోకం" సినిమా చూసినట్టే. వాడు ఏమి చేశాడో... వద్దు అని మనం చెవులు మూసుకున్నా, పని ఉంది అని లేని పనిని గుర్తుకు తెచ్చుకున్నా, వడలకుండా... వద్దన్నా వెంట పడి సినిమాల గురించి చెప్పే తెలుగు చానళ్ళ లాగా చెవులలో నుండి రక్తం వచ్చేలా చెప్పేస్తారు.

ఇలా వీళ్ళ బాధ తట్టుకోలేక నేను కూడా ఏదో ఒకటి చేసెయ్యాలని గట్టిగా "వచ్చే వారం నుండి నేను కూడా వీకెండ్ ఎంజాయ్ చేసి వీళ్ళకు పిట్ట కథలు... బుర్ర కథలుగా చెప్పాలి అని నేను రాసే కోడ్ మీద ఒట్టు ఒట్టు పెట్టుకున్నా... ఎమైందో ఏమో అప్పటి నుండి నేను రాసిన కోడ్ పని చెయ్యటం మానేసింది. అప్పుడు మా సిద్దుగాడు నాకు సహాయం చేస్తా అని మా RUM బ్యాచ్ ముందు.... పావలాకి రూపాయి యాక్టింగ్ చెయ్యటం మొదలెట్టాడు. అప్పుడు నేను "వద్దురా సిద్దు... సీనుగాడు, సిద్దుగాడు కలిసి కోడ్ రాస్తే... "బగ్గులు" రాలుతాయి..." అన్నాను. ఇంకేముంది... వీకెండ్ మనకు ఆఫిసులో మనకు దీపావళి, దసరా, రంజాను, క్రిస్టమస్ అన్నీ....

అలా నేను ప్రతిఘ్న చేసిన తరువాత వారం ఆఫిసులోనే గడిచిపోయింది. అందుకే నా ప్రతిఘ్నలో చిన్న సవరణ చేసి... దాని సారాంశం అంతా అలాగే ఉంచి ఒట్టు మాత్రం మా సిద్దుగాడు రాసిన కోడ్ మీద పెట్టాను. అప్పటి నుండి మా సిద్దుగాడికి దసరా, దీపావళి etc.... అది వేరే విషయం.

రెండవ వారం :

అదేంటో... నా ప్రతిఘ్న మహిమో మరి ఇంకా ఏంటొగానీ... మా "ఎడారికి ఎక్కువ సిటీకి తక్కువ ఐన" గుర్గావ్ లోని PVR వాడికి సడన్ గా మన తెలుగు హీరోలు అందరూ తెలిసిపోయారు... ఇంకేముంది నాకు తెలుగు సినిమాలు చూసే అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టుగా పట్టుకుంది.

శుక్రవారం ఇలా ఆఫీసు అయిపోగానే... శనివారం రోజు పొద్దున్నే PVRలో చూడబోయే తెలుగు సినిమా గురించి కల కంటూ నిద్రపోయాను. తెల్లవారుఝామునే 11 గంటలకి నిద్ర లేచి పళ్ళు కూడా తోముకోకుండా.. అలాగే సినిమాకి వెళ్ళిపోయాను. సినిమా పేరు "రక్ష". నేను పడే ఆవేశానికి తోడు... టికెట్ కౌంటరు దగ్గర ఉండే వాడు నన్ను జురాసిక్ పార్కు నుండి తప్పించు కొని వచ్చిన డైనోసారు అన్నట్టుగా చూసాడు. తిక్కెట్టుకు డబ్బులు ఇవ్వగానే... "మీరు చాలా అదృష్టవంతులు సార్!!! మీకు సీటు హాలు మధ్యలో దొరికింది" అన్నాడు. ఇదే ఆఖరి టిక్కెట్ట్ అన్నట్టుగా నాకు టిక్కెట్టు ఇచ్చాడు. నాకు మాత్రం సొనాలి బింద్రే లాంటి అమ్మాయితో డేటింగ్ దొరికినంత ఆనందపడిపోయాను. అలా టిక్కెట్టు తీసుకొని ఆడిటొరియం దగ్గరికి వెళ్ళే సరికి.... నా లాంటి నిర్భాగ్య, అభాగ్య జీవులు నాలుగైదు మాత్రమే ఉన్నాయి... అదే విషయం అక్కడ ఉండే వాడిని అడిగాను. " ఇది రాం గోపాల్ వర్మ సినిమా సార్.... ప్రేక్షకులు మెల్లి మెల్లిగా వస్తారు" అన్నాడు.

సినిమా మొదలైంది.... సినిమా పేరు "రక్ష" ... మీకు ఎప్పుడైనా చేతబడి జరిగిందా??? అనేది క్యాప్షను. సినిమా మొదలవగానే నేను నవ్వటం మొదలుపెట్టాను... నేను ఒక్కడినే నవ్వుతున్నానా లేక అందరు నవ్వుతున్నారా అని చుట్టూ చూసాను... నేను, నాతో పాటు...... నలుగురితో పాటు... నారాయణ అనుకునేట్టు...నలుగురు అంతే... వాళ్ళు కూడా పగలబడి నవ్వుతున్నారు. అప్పుడు నాకు "చేతబడి జరిగింది... రాం గోపాల్ వర్మ కి అందుకే... "రక్ష" లాటి సినిమా తీసాడు... వీడికి నా మీద ఎందుకంత కక్ష???" అనిపించింది.

సినిమా మొత్తంలో భయపడింది జగపతి బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి మాత్రమే.... నాకు ఐతే మాంచి కామేడి సినిమా చూసిన ఆనందం మిగిలింది.

మూడవ వారం :

చేతబడి చేయబడ్డ రాం గోపాల్ వర్మ సినిమా నుండి తేరుకునే లోపల మళ్ళీ వీకెండ్ వచ్చింది.
సారి మా PVR వాడికి నచ్చిన సినిమా... కేక.
సినిమాని చూడవద్దని నా ఆరో ప్రాణం అరిచింది. అలా అరిచిన నా ఆరోప్రాణానికి నా మనసు "విశ్వ విఖ్యాత దర్శకుడు తేజ గారు "చిత్రం, నువ్వు-నేను, జయం, ఒక 'V' చిత్రం లాంటి కళా"ఖండా"లను మన మీదికి వదిలారు. మనం అలాంటి వాళ్ళను ఆదుకోవాలి" అని నోరు నొక్కేసి... ఎనస్థీషియా ఇచ్చేసాను. ఐనా నా పర్సులో ఉన్న Rs.300కు పోగాలం దాపురించినపుడు ఎవడు మాత్రం ఆపగలడు??

పోయిన సారి ఐన అనుభవంతో టిక్కెట్టు దొరకగానే కొరివి దయ్యానికి కొబ్బరి దొరికినట్టుగా సంభరపడి పోకుండా ఆడిటోరియంలోకి వెళ్ళాను. సారి కొద్దిగా నాలాంటి అభాగ్య జీవాలు ఉన్నాయి. సినిమా మొదలవగానే ఒకటే... విజిల్స్, చప్పట్లు.... ఇక్కడ ఉన్న జనానికి వచ్చే సౌండ్ కి మాత్రం పొంతన లేకపోయేసరికి... నా ప్రక్కన కూర్చున్న వాడిని చూసాను.. వాడు టేప్ రికార్డర్ లో చప్పట్లు, విజిల్స్ ని రికార్డ్ చేసుకొని వచ్చి థియేటర్ లో ప్లే చేస్తున్నాడు.

అది చూసి నేను మీరు తేజ గారికి మంచి అభిమాని అనుకుంటాను అన్నాను.
అప్పుడు
అతను " అవును.. నేను తేజగారికి విపరీతమైన అభిమానిని. ఆయన తీసే సినిమాలు "కత్తి". అసలు అతను పెట్టే సినిమా పేర్లే వింతగా ఉంటాయి. ఆయన లాగా సినిమాలు మన తెలుగు ఇండస్టరిలో ఎవరూ తియ్యలేరు...".

అతనిని మాట్లాడిస్తే తేజ గురించి ఒక రోజు మొత్తం మాట్లాడేలా ఉన్నాడు అనుకొని... "సార్... నన్ను కొంచెం నన్ను సినిమా చూడనిస్తారా???" అన్నాను.
"
ఏంటండీ ... మీరు మరీను... సినిమాకు వచ్చేది సినిమా గురించి మాట్లాడుకోవటానికేగా... సినిమా చూడటానికి వచ్చినట్టుగా మాట్లాడుతారేంటి మీరు... " అన్నాడు.

"ఏంటీ... సినిమా థీయేటర్ కి వచ్చేది సినిమా చూడటానికి కాదా???? సినిమా గురించి మాట్లాడుకోవటానికా... ఎంత గొప్పగా చెప్పావు రా బాబు" అనుకున్నాను.

"అసలు హీరో సెలక్షను చూడండి... ఎంతగా సహజత్వానికి దగ్గరగా ఉన్నాడో..." అంటూ ఒక దిక్కిమాలిన జుట్టుపోలిగాడిని చూపిస్తూ.. "అవునండీ... మీరు చెప్పేదాకా అతను నాకు హీరో అనిపించలేదు. సినిమాలో అడుక్కున్నే
బిచ్చగాడేమో అనుకున్నాను. ఎంతగా సహజత్వానికి దగ్గరగా ఉందో..." అన్నాను.

"చూసారా... ఇలాగ హీరో సెలక్షను, సినిమాని ఇన్ని మలుపులు తిప్పటం తేజగారికే సాధ్యం.. అందుకే పొద్దుటినుండి ఇది మూడోసారి చూడటం..." అన్నాడు.

"అవునండీ... చాలా గొప్ప సెలక్షను, గొప్ప మలుపులు. ఇంక ఎంత సేపు నలుపుతారండీ నన్ను" అన్నాను.

"మీకు హాస్యచతురత కొంచెం ఎక్కువే అనుకుంటాను" అన్నాను.

నేను పడే బాధ మీకు కామెడీగా ఉందా నాయనా... అనుకున్నాను.

సినిమా intervalలో నా సీటు మార్చుకుందామని చూసాను... కానీ నాలాంటి అభాగ్య జీవులు చాలా మంది సినిమాకి రావటం వల్ల నాకు అదృష్టం లేకుండా పోయింది. సినిమా నడుస్తున్నంత సేపు తేజ తీసిన ఒక్కో కళా"ఖండా"లను గురించి మార్చి, మార్చి... మళ్ళీ మళ్ళీ, తిప్పి తిప్పి చెప్పాడు. నా కాలేజీ రోజులలో మా లెక్చరర్ చెప్పే విషయాలను కూడా ఇంతసేపు నేను ఎప్పుడూ వినలేదు.

సినిమాకి వెళ్ళి నేను పెట్టిన చావు, గావు కేక మా ఎడరి ప్రాంతం మొత్తం వినిపించింది. సినిమా వల్ల నాకు మిగిలిన ఆస్థి.... తలనొప్పి, రెండు Zandu Balm డబ్బాలు + Rs.300 క్రెడిట్ కార్డు బిల్లు అదనం.

ఐనా.....ఇంటి దగ్గర... కృష్ణ మంచిగా డ్యాన్స్ చేస్తాడా లేక జగపతి బాబు మంచిగా డ్యాన్స్ చేస్తాడా???, శోభన్ బాబు ఇద్దరు భార్యల ముద్దుల భర్త పొజిషను కి replacement జగపతి బాబేనా??? అనే ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక మాంద్యానికి కారణాలైన సమస్యల గురించి మా సిద్దుగాడు ప్రసంగించే సభలకు పోకుండా తప్పించుకుందామని అనుకున్న నాకు ఇలా జరగవసిందే...

నా కష్టాలు సరేలేండీ... ఇంతకు మీరు వీకెండ్ ఏమి చేశారు???

Friday, November 7, 2008

బ్రహ్మచారి జీవితం


బ్రహ్మచారి జీవితం గురించి చాలా మంది ఇప్పటికే చాలా బ్లాగర్లు చాలా రకాలుగా రాసే ఉంటారు (నేను ఈ బ్లాగు లోకానికి కొత్త కాబట్టి..... ఎవరు రాసారో నేను ఇక్కడ రాయలేకపోతున్నా).. కానీ నాకు కూడా నా అనుభవం గురించి
రాయాలని అనిపించింది. ఎందుకంటే... బ్రహ్మచారిగా అది నా జన్మహక్కు.

ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్య... బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వకపోవటం... అదే నా ఆవేదన... సగటు బ్రహ్మచారి ఆవేదన. ఎన్నో ఖాళీ గదులున్న ఇంటి యజమానులు బ్రహ్మచారులకు గది ఇవ్వమని చెప్తుంటే వాళ్ళు పడే ఆవేదన నాకు తెలుసు. ఇప్పటి ఇంటి యజమానులు కూడా ఒకప్పటి బ్రహ్మచారులే అని ఎందుకు గ్రహించరు???.

బ్యాచిలర్స్ కి రూము ఇస్తే...

1. ఇంటి యజమానికి భయం..... ఒకటో తారీఖు కల్లా అద్దె కడతాడొలేదో అని.... (ఒక వేళ అద్దె ఇవ్వమని అడిగితే స్నేహితులని తీసుకొచ్చి ఇరగ కుమ్మేస్తాడేమొనని)

2. ఇంటి యజమానికి మంచి అందమైన భార్య ఉంటే ఇంకా భయం... ఎక్కడ తన భార్యకి బీటేస్తారేమోనని..

3. అందమైన కూతుళ్ళున్న ఇంటి యజమానికి ఇంకా భయం... ఎక్కడ తన కూతుళ్ళని లేపుకుపోతారేమోనని...

4. బ్యాచిలర్స్ దిగిన రూము ఎదురుగా ఉండే కొత్తగ పెళ్ళైన జంటకి ఇంకా భయం.....

5. అమాయకపు ఇంటి యజమానికి ఇంకా భయం... ఒక వర్షం కురవని weekend ఎక్కడ "కుంభమేళ" చేసి తన చేత "రాంబాబు" క్యారెక్టరు వేయిస్తారేమొనని...

6. ఇంటి ప్రక్కన బార్ లేకపోతే... ఇంటి యజమానికి ఇంకా భయం... ఎక్కడ తన ఇంటినే బార్ లాగా మార్చేస్తారేమొనని...

7. వంటరాని బ్యాచిలర్స్ అంటే భయం.... ఎప్పుడు చూసినా తన ఇంట్లోనే పడి మేస్తారేమొనని...

8. వంట వచ్చిన బ్యాచిలర్స్ ఐతే ఇంకో భయం.... వంట పేరుతో తన ఇల్లంతా తగలబెట్టటమే కాకుండా.... వండిన వింత వింత వంటలన్నీ తనతోనే తినిపిస్తారేమొనని...

ఈ పైన చెప్పిన కారణాలన్నీ చెప్పి... 3/4 బెడ్రూముల దగ్గర నుండి సింగిల్ రూము సెట్ ఉన్న ఇంటి యజమానుల వరకు మాలాంటి బ్యాచిలర్స్ కి అద్దెకు రూములు ఇవ్వకపోతే.... సగటు బ్యాచిలర్ తన జీవితాన్ని ఏ ఫుట్ పాత్ల పైన గడపాలి....

ఒక్కసారి బ్రహ్మచారి బోడిగుండు బ్రహ్మానందం గారు చెప్పిన "బ్రహ్మచారి పురాణం" గుర్తుచేసుకుందాం... "ఎక్కడ బ్రహ్మచారి కి అడిగిన వెంటనే గది అద్దెకు ఇవ్వబడుతుందో... ఎన్ని "కుంభమేళాలు" చేసినా ఇంటి యజమాని ఏమీ అనడో... ఇంటిని చెత్తకుండిలా చేసినా కిక్కురుమనకుండా ఉంటాడో... అట్టి చోటికి నా తోటి బ్రహ్మచారులను తీసుకెళ్ళు". అందుకే ఇది చూసి తట్టుకోలేకే BAP (Bachelor Accomodation Provider) అనే సంస్థను స్థాపించాలని అనుకుంటున్నాను. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే.


Sunday, November 2, 2008

పెళ్ళికి వెళ్తూ పిల్లిని.......



పెళ్ళికి వెళ్తూ పిల్లిని వెంటపెట్టుకెళ్ళటం అనేది పాత సామెత... నా అనుభవంతో దాన్ని నేను మార్చి నా సామెతల పుస్తకంలో ఈ మధ్యనే రాసుకున్నా...

***************************************************************************************************************

దీపావళికి ఇంటికి రమ్మనీ ఒకటే ఇంటి దగ్గరి నుండి గోల. ఇంటికి ఫోను చేసిన ప్రతీసారీ నా మెదడును ఫ్రై చేసుకొనీ తినేస్తున్నారు. "అది కాదు అమ్మా.... మొన్నే రెండు నెలల క్రిందే కదా వచ్చింది. ఇప్పుడు flight చార్జీలు పెరగటం వల్ల నా క్రెడిట్ కార్డు బిల్లు Rs.999121943432121.99 వచ్చింది. నువ్వు మళ్ళీ దీపావళి పెద్ద పండగ కదా రావలసిందే అంటే ఎలా అమ్మా??? సరేలే చూస్తాను" అని ఫోను పెట్టేశాను. flight బుక్ చేసుకుందామని www.makemytrip.com ఓపెన్ చేసి డిల్లీ నుండి హైదరాబాదు కి టిక్కెట్ రేటు చూసా.... అలా కిందపడి పోయాను. నా పక్కనే ఉన్న సిద్దు గాడు నీళ్ళు చల్లి నన్ను లేపి ఏమయ్యిందని అడిగాడు. అప్పుడు నేను "ఆ flight రేట్లు చూడరా బాబు.... Rs.999898493.99 అంటా. వీపు "విమానం" మోత మోగటం అంటే ఇదేనేమో?????" అన్నాను.

వెంటనే సాగర్ గాడికి ఫోనె చేసి విషయం చెప్పా. వాడు " ఒరేయ్ సీనుగా... ఆ సిద్దుగాడితో కలిసి తిరగకు రా.. నువ్వు కుడా వాడి లాగా అయిపొతావు అంటే విన్నావు కాదు" అన్నాడు. అది సారే గానీ ఇప్పుడు ఎమిటి చెయ్యటం అని అడిగాను. అప్పుడు వాడు "ఆగురా... నా అరికాలు కొంచెం గోక్కోనీయి..... ... ఆ అయిడియా..... ఆ సిద్దు గాడితో స్నేహం చెయ్యటంవల్ల డిల్లీ నుండి హైదరాబాదుకి రైలు మార్గం ఉన్నదనే విషయమే మర్చిపోయావు చూసావా.. ఇప్పుడు అన్నీ Waiting Listలే ఉండి ఉంటాయి. కాబట్టి Tatkalలో ప్రయత్నించు. ఆ "విమానం" మోత ఉండకూడదు అంటే ఈ సారికి రైళ్ళో వెళ్ళూ" అన్నాడు.

సాగర్ గాడు చెప్పినదాంట్లో కొంచెం నిజం ఉంది అనిపించింది. "ఈ సిద్దుగాడితో స్నేహం చేసి ఇలా తయ్యారయ్యాను" అనుకున్నాను. నేను రైలు టిక్కట్టు బుక్ చేసుకుందామని అనుకునే సరికీ ఈ సిద్దుగాడు నాతో హైదరబాదు కి వస్తా అని కింద పడి పొర్లాడుతూ ఏడ్వటం మొదలుపెట్టాడు. "అది ఏంటి రా సిద్దు.. నువ్వు Spice Jetలో టిక్కెట్టు బుక్ చేసుకున్నవనుకుంటా కదా... మళ్ళీ ఇప్పుడు నాతో రైళ్ళో వస్తాని ఏడుస్తున్నావ్...." అన్నాను. "అది కాదు రా సీను... నేను బుక్ చేసుకున్న flight cancel అయ్యింది అని ఇప్పుడె SMS వచ్చింది. దానికి వాళ్ళు కారణం ఏమీ చెప్పలేదు" అన్నాడు. "ఒరేయ్.... నా ముందు తింగరి వేషాలు వెయ్యకు... ఇప్పుడే మా సాగర్ గాడు చెప్పాడు..... ఎవడో సిద్దు అనేవాడు ఆ flightAలో వస్తున్నాడు అని... ఆ flight cancel చేసారంటా.... ఆ తింగరి సిద్దు గాడివి నువ్వే అని మాకు బాగా తెలుసు. పోయినసారి నువ్వు ప్రయాణించిన GoAir కంపెని.. నీ స్వర్ణ చరణపు దెబ్బకి, నీ తింగరి చేష్టలకీ మూసుకున్నాడు. Spice Jet వాళ్ళు చాలా అదృష్టవంతులు. నీ చరణపు మహత్యం, నీ తింగరి చేష్టలు ముందే తెలిసి జాగ్రత్తపడుతున్నారు" అన్నాను.". అప్పుడు వాడు "ఒరేయ్ సీను నువ్వు నన్ను ఊరికే తింగరి సిద్దు అని పిలవటం ఎమీ బాగాలేదు రా.. నేను ఎమీ చేసాను అని అలా పిలుస్తున్నావు రా???" అన్నాడు. ఇప్పుడు నీకు కారణం కావాలి అంటే... నువ్వు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే... ఫ్లాష్ బ్యాక్ అంటే రింగులు రింగులు తిరగాలి అంటావ్ కాబట్టి... ఇప్పుడు వచ్చేది దీపావళి పండగ కదా... అందుకే భూచక్రాలు వాడుకో...

***************************************************************************************************************

మేం 8th క్లాసులో ఉన్నప్పుడు మా క్లాసులో "చంద్రకళ" అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి మా సిద్దుగాడు లైనేసేవాడు. మాకు మాత్రం వాడు ఆ అమ్మాయిలో ఏమి చూసి ప్రేమించాడో అర్థం కాక అదే విషయం వాడిని అడిగాము. అప్పుడు వాడు "కాకి నల్లగా ఎందుకు ఉంటుందో, కుక్క తోక వంకరగా ఎందుకు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ నేను చంద్రకళనే ఎందుకు ప్రేమిస్తున్నానో చెప్పటానికి నాకు కారణం ఉంది. చంద్రకళ "అమీబా" బొమ్మ చాలా బాగా వేస్తుంది".

"అమీబా బొమ్మ బాగా వెయ్యటం ఏంటిరా ధరిదృడా.... అమీబా బొమ్మ ఒక నక్షత్రంలాగా ఉంటుంది కదా. ఉన్న బొమ్మల్లో అన్నింటి కన్నా చాలా వీజీగా వేసే బొమ్మ అదే కదా. దానికి కష్టపడటం ఏమి ఉంది రా??" అన్నాను.

మీరంతా ఇంతేరా... "కళ"ను ప్రేమించే మనస్సు అందరికీ ఉండదు రా. Driving చేసేవాడిని Driver అంటే... Drawing వేసేవాళ్ళని Drawer అంటారు కదా. చంద్రకళే నా favourite Drawer. ఇదే విషయం తనకి చెప్పటానికి ఈ శనివారం ఆంజనేయ స్వామి గుడిలో తనని కలుసుకుంటున్నాను" అన్నాడు. వాడు ఏమి చెప్పాడొ మాకు ఏమీ అర్థం కాలేదు.. కానీ వాడు ఆ రోజు రాత్రికి పార్టీ ఇస్తా అన్న విషయం మాత్రం బాగా అర్థం అయ్యింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే లేసి హనుమంతుడిలాగా తయారయ్యాడు. వాడిని చూసి నాకు అనుమానం వేసి ఏ సర్కస్ కీ వెల్తున్నావని అడిగాను.

"వెళ్ళే దేవుడి గుడిని బట్టి వేషం వేసుకొమ్మని మా బాబాయ్ చెప్పాడు రా" అన్నాడు.

"ఒరేయ్!!!! మీ బాబాయ్ ని మీ పిన్ని వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది రా???" అన్నాను.

"పెళ్ళి ఐన నెల రోజులకే... ఐనా నేను ఎప్పుడూ మా బాబాయ్ గురించి నీకు చెప్పలేదే... అంత కరెక్ట్ గా ఎలా guess చేసావు రా నువ్వు" అన్నాడు.


"అది అంతే... నువ్వు ఇలా తింగరోడివి అవటానికి కారణం ఏమిటా అనుకున్నా... నాకు ఈ రోజు అర్థం అయ్యింది... అక్కడ నీ కోసం చంద్రకళ waiting వెళ్ళు బాబూ... వెళ్ళు" అన్నాను.


అదే వేషంతో గుడికి వెళ్ళి దేవుడుకి చేయవల్సిన ప్రదక్షిన హుండికీ చేసి చంద్రకళకి విషయం చెప్పి ఆమె చేతి వేలిముద్రలు చెంప మీద వేసుకొని వచ్చాడు.


అక్కడ జరిగిన విషయం అందరికీ చెప్పి "failures are stepping stones for success. ప్రేమించే మనస్సు వీళ్లకు అర్థం కాదు రా. పూజారికి ఏమి తెలుసు Peter Scotch పవర్" అన్నాడు. అది విని నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ వాడు ఏదో కొ(చె)త్త విషయం చెప్పినట్టుగా చప్పట్లు కొట్టారు (ఇలాంటి వింత ప్రకటనలు చేస్తాడు కాబట్టే మేము వాడిని తింగరి సిద్దు అని పిలవటం మొదలెట్టాము).

***************************************************************************************************************


"ఒరేయ్ సిద్దూ... నీకు ఇష్టమైన డైరెక్టరు ఎవరు రా???" అని ఎవరైనా అడిగితే..... "నాకు తేజ అంటే చాలా ఇష్టం. అతను తీసిన "ఒక 'V' చిత్రం" సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా ఇప్పటికి 18432753.987843 సార్లు చూసాను" అని సిగ్గు పడుతూ చెప్తాడు. జిందాబాద్.. జిందాబాద్... డైరెక్టరు తేజ.... జిందాబాద్.

***************************************************************************************************************

చెప్పిన ప్లాష్ బ్యాక్ విని ఈ పింజారీ పీనుగు ఇంకా గొంతు పెంచి ఏడుస్తూంటే...... మా ప్రక్క ప్రాజెక్ట్ లో ఉండే RUM బ్యాచ్ (రంభ లో నుండి Rనీ, ఊర్వశి లో నుండి Uనీ, మేనక లో నుండి Mనీ తీసి RUM బ్యాచ్ అని.... నేనే నామకరణం చేసాను) నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. "ఇంక చేసిన డ్రామా చాలు కానీ.. నీకు కూడా టిక్కెట్టు బుక్ చేస్తాను" అన్నాను.

దీపావళికి టిక్కెట్లు బుక్ చేసి ప్రింట్ తీసి మా సిద్దుగాడికి ఇచ్చి భద్రంగా ఉంచమని చెప్పాను.

మొత్తానికి journey చేసే రోజు వచ్చేసింది. ఆ రోజు నా లగేజి తీసుకొని మా రూములో నుండి బయటికి వెళ్ళేసరికి మా ఇంటి ప్రక్కనుండే రాజనాల నాగభూషణం ఇంట్లో ఉండే నల్ల పిల్లి నన్ను చూసి నవ్వింది. అది చూసి వాడు "మా పిల్లి గొప్పతనం నీకు తెలియదు. ఈ రోజు ప్రయాణం నీ జీవితంలో మరిచిపోవు బాబు" అన్నాడు. "అవునండీ విన్నాను.. మీ నల్లపిల్లి గొప్పతనం గురించి ఢిల్లీలో అందరూ తెలుగులో చెప్పుకుంటున్నారు" అన్నాను.

ఒకసారి నా ఖర్మ రబ్బరు టైరులా కాలి.. నల్లపిల్లిని పెంచటం ఏమిటని వాడిని అడిగాను... దానికి నాకు వచ్చిన సమాధానం.....

"నల్ల, తెల్ల పిల్లి చూడ నొక్కపోలికనుండు
పట్టి, పట్టి చూడ రంగులు వేరు
పిల్లులందు నల్లపిల్లులు వేరయా
విశ్వదాభిరామ ఎలుకను వేటాడి తినునా!!!


నల్ల పిల్లిని పెంచటం ఏంటో... ఎడారిలో ఇసుక అమ్ముకునే ఫేసు వాడూనూ. తిక్క ముదిరి రాజనాల నాగభూషణం అవటం అంటే ఇదే.

అసలే మా సిద్దుగాడితో ప్రయాణం... పైగా ఈ రాజనాల నాగభూషణం గాడి నల్ల పిల్లి నవ్వింది. ఇంక ఈ రోజు జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనుకుంటూ బయలుదేరాను.

నేను, సిద్దుగాడు కలిసి రైల్వే స్టేషనుకి వెళ్ళి AP Express ఆగే ఫ్లాట్ ఫాం దగ్గర ఆగాము. మా కన్నా ముందే ఏదో కొత్త సినిమాకి screen test కోసం వచ్చిన హీరోయిన్ల లాగా ఉన్న 50 నుండి 60 మంది అందమైన అమ్మాయిలు train కోసం ఆగి ఉన్నారు. అది చూసిన మా సిద్దుగాడు... కొరివి దయ్యానికి కొబ్బరి దొరికినట్టుగా సంభరపడిపోతూ... వాడి makeup kit తీసి వాడి ముఖానికి ఒక సెంటి మీటరు మేర పౌడరు పూసుకున్నాడు. " ఒరేయ్ సీనుగా.... ఈ రోజు పొద్దున్నే లేసి కృష్ణుడి ముఖం చూడటం బాగా కలిసి వచ్చింది.... నేను ఒంటరిగా 24 గంటలు ప్రయాణం చేస్తున్నానని కరుణించి కరువు ప్రాంతంలో ఉన్నవాడికి ఒకేసారి 50-60 చికెన్ బిర్యానీ పొట్లాలు ఇచ్చినట్టుగా ఇంత మంది గోపికలను పంపించాడు..".

"రావలసిన ట్రైను రాక ఒకడు ఏడుస్తుంటే ఫేసుకు రాసుకోవటానికి Fair & Lovely అడిగాడంటా... ఎవడో వెనకటికి నీలాంటొడు" అన్నాను.

మొత్తానికి మేము ఎక్కే A P Express రావటంతో... వీడి సొది వినే బాధ తప్పింది అనుకొని... "ఓరేయ్ సిద్దూ... నీకు ఇచ్చిన టిక్కెట్లు ఇలా ఇవ్వు... మన సీట్లు ఎక్కడో చూద్దాం" అన్నాను.

"అదేంటి రా... టిక్కెట్లు భద్రంగా ఉంచమని చెప్పావు కదా... అందుకే ఇంట్లో పెట్టి వచ్చాను" అన్నాడు.

"అప్పుడే అనుకున్నా... నువ్వు నా వెంట వస్తుంటే... ఇంకా నా జీవితం మలుపు తిరగటంలేదు ఏంటా అనీ..." అన్నాను. వాడు చేసిన పనికి నాకు వాడిని అదే A P Express క్రిందకి తొయ్యాలని అనిపించింది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి... సరే ఎలాగోలా T.C నీ మానేజ్ చేద్దాం అని రైలు ఎక్కాము.

మేం ఎక్కిన రైలు స్టార్ట్ అవ్వగానే.... T.C వచ్చి నా ప్రక్కన కూర్చొని "బాబు... నీ యొక్క ప్రయాణపు రశీదు చూపిస్తావా" అన్నాడు.

"ఏంటి... ప్రయాణపు రశీదా.... *#*(#@*(#@#@&*^&???" అన్నాను.

"ప్రయాణపు రశీదునే.... టిక్కెట్టు అందురు... మీ దిక్కుమాలిన ఆంగ్లమున. హే శ్రీ కృష్ణదేవరాయా!!!! తెలుగు దేశంలో పుట్టి, తెలుగువారు అయ్యుండీ... ఆ ఆంగ్లపు కూత ఏమిటో.." అన్నాడు.

"మా దగ్గర టిక్కెట్లు లేవండీ....పొరపాటున ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాము" అన్నాను.

"చూడండి బాబు... ధూమశకటమునందు ప్రయాణించుటకు ప్రయాణపు రశీదు కొనుట మీ విధి" అన్నాడు".

"మీరు చెప్పినవి ఏవీ నాకు అర్థం కాలేదు... ఒక్క విధి అనే మాట తప్ప. విధి అంటే E TVలో వచ్చే సీరియల్ కదా" అన్నాడు మా సిద్దుగాడు.

దానికి T.C "నీలాంటి దిక్కుమాలిన వాళ్ళు మాత్రమే అలాంటి ధారావాహికలు చూస్తారు. ఐనా నేను మాట్లాడింది తెలుగు భాషే కదా... అందులో అర్థంకాకపోవటానికి ఏముందీ???" అన్నాడు.

"మీరు నన్ను ఏమైనా అనండీ... అంతే కానీ... E TV సుమన్ నీ, అందులో నటించే ప్రభాకర్ నీ ఏమీ అనకండి. ఆయన తీసే సీరియల్స్ "ఎండమావులు, కళంకిత, పద్మవ్యూహం etc..." ఎంత బాగుంటాయో..." అన్నాడు మా సిద్దుగాడు.

"ప్రభాకర్, సుమన్ రాసుకుంటే... ఇలాంటి ధారావాహికలే రాలుతాయి మరీ..." అన్నాడు "T.C.

అంతలో ఏమయ్యిందో మా సిద్దుగాడికి... బ్యాగులో నుండి టిక్కెట్లు తీసి చూపించాడు... అది చూసిన T.C " ఏడుస్తూ పాడినంత మాత్రాన అది ఏడుపు పాట ఎలా కాదో... పునర్నివేషం అడిగిననత మాత్రాన... పురో పునర్నివేషం మాత్రమే వస్తుందని ఊహించకూడదు (Feedback అడిగిననత మాత్రాన positive Feedback మాత్రమే వస్తుంది అని అనుకోకూడదు). ప్రయాణపు రశీదు చూపించినంత మాత్రాన.. అది ఈ యొక్క ధూమశకటానిదే అవ్వాలని లేదు. ఇలాంటి తిక్క వేషాలు నా వద్ద వేశావంటే.... ఉష్ణగ్రాహక ఘటమునందు ఉడికించెదను జాగ్రత్త... పింజారీ పీనుగా...".

ఏమి పోలికలు చేప్పావు రా నాయనా... ఉష్ణ గ్రాహక ఘటమా.... %$&*$(*))*@. అసలే ఈ T.C నీ ఎలా మానేజ్ చెయ్యాలా అని నేను చస్తుంటే... మా తింగరి సిద్దుగాడు వాడికి ఇంకా పిచ్చెక్కేలా చేస్తున్నాడు. కుక్కని రెచ్చగొట్టి మరీ కరిపించుకోవటం అంటే ఇదే. అయిపోయింది... అంతా అయిపోయింది.... T.C నీ ఎలాగైనా మానేజ్ చేసి టిక్కెట్లు సంపాదిద్దామని అనుకున్న Titanic షిప్ లాంటి నా ఆలోచనకు కావలసిన Iceberg వీడు తయారు చేసేసాడు. అమ్మా!!!! గూగుల్లమ్మ తల్లీ... ఎక్కడున్నావమ్మా... నాకు ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువుని ప్రసాదించి ఈ T.C ని బుట్టలో వేసే మార్గం చూపించు తల్లీ!!!!!!!!!!!!!

***************************************************************************************************************

ఈ అనుభవంతో... పెళ్ళికి వెళ్తూ పిల్లిని వెంటపెట్టుకెళ్ళటం అనేది పాత సామెత... Train Journey చేస్తూ.. తింగరోడిని వెంటపెట్టుకెళ్ళటం అనేది కొత్త సామెత. దీన్ని నా సామెతల పుస్తకంలో నేను ఈ మధ్యనే సరిచేసుకున్నా.

Tuesday, July 8, 2008

ఆ మూడు రోజులు....


********************** ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యింది ******************

దినం, సమయం : 1988, రెండవ తరగతి గది

మాస్టారు : ఒరేయ్ సీను, కాలాలు ఎన్ని రకాలో చెప్పు.

సీను గాడు : మరే... మరేమోనండీ... కాలాలు మూడు రకాలండీ. భూత కాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూత కాలం అంటే.. భూతాలు, దెయ్యాల కాలం కాదండీ, జరిగిన కాలంలో ఎవడెవడికి మూడిందో చెప్పేది. వర్తమానం అంటే జరుగుతున్నదీ మరియు భవిష్యత్ కాలం అంటే.. ముందు ముందు ఎవడికి మూడుతుందో చెప్పేది. అలాగే రుతుపవన కాలాలు కూడా మూడేనండీ. వర్షా కాలం, ఎండా కాలం మరియూ చలి కాలం.

********************** ఫ్లాష్ బ్యాక్ ముగిసింది **********************

కాలాలు మూడు.. అవి భూత, భవిష్యత్ మరియు వర్తమాన కాలాలు. ఇంకో కాలం కూడా ఉంది... అది పోయే కాలం. అది ఎప్పుడు, ఎలా, ఎవరికి వస్తుందో... ఎవరికీ తెలియదు.

మొన్నీ మధ్య నేను పని చేసే ప్రాజెక్ట్ కి సెలవు ఇచ్చారు అది కూడా weekendతో కలిపి. సరేలే..... మూడు రోజులు సెలవులు వచ్చాయి కదా అని... కులు, మనాలి విహారయాత్రకి అంతా సిద్దం చేశాం. అప్పుడే, మా NCR (నరకపు Capital Region).. క్షమించాలి National Capital Region మీద ఆ వరుణ దేవుడికి చాలా ప్రేమ కలిగింది (ఢిల్లీ, గుర్గావ్ మరియూ నోయిడాని కలిపి NCR (National Capital Region) అంటారు). అందుకే రెండు రోజులు వర్షం, ఎండ కలిపి వచ్చేలా చేశాడు. ఇక్కడ రుతుపవన కాలాల గురుంచి వచ్చింది కాబట్టి చెపుతున్నా... అప్పుడు ఆ పుస్తకం రాసినవాడికీ, చెప్పిన మా మాస్టారికీ ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల గురుంచీ తెలియదు అనుకుంటా... లేకుంటే రుతుపవన కాలాలు రెండే అని చెప్పేవారు. నిజమే.... గుర్గావ్ లో వుండే వాళ్ళకి రెండే కాలాలు.. అవి, చలి కాలం మరియు ఎండా కాలం. ఇంతకు ముందు చెప్పినట్టు వానా కాలం వస్తుంది కానీ అది వచ్చినట్టే ఉండదు. చలి కాలం ఎలా ఉంటుంది అంటే... ఇంట్లో నుండి బయటికి రావాలనీ కూడా అనిపించదు. చలి కాలంలో అప్పుడప్పుడూ temparature 1 డిగ్రీకి కూడా పడిపోతుంది. ఇంక ఎండా కాలంలో ఎంత బాగా ఉంటుందో.... చెప్పటానికి భాష లేదు, రాదు కూడా... అంత బాగా ఉంటుంది (నిజమే అనుకున్న వాళ్ళు దగ్గరలోని డాక్టరుని కలవవలసిందిగా నా ప్రార్ధన). ఎండా కాలంలో A/c, cooler, fanలు తిరుగుతూనే ఉంటాయి కానీ చెమటలు వస్తూనే ఉంటాయి. అందుకనే ఇక్కడి వాళ్ళు చెమట తూడుచుకోవటానికి కర్చీఫ్ లాంటివి వాడరు... వాడరూ అంటే దాని అర్థం అవి వాడరు అని ... దాని బదులు ఒక పెద్ద టవల్ వాడతారు. ఇంక ఈ కాలంలో ఒక మంచి తెల్ల షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళామంటే దానికి పట్టిన చెమట పోవాలీ అంటే కనీసం రెండు రోజులు ఉతకాలి. అందుకనే ఇక్కడికి వచ్చిన తరువాత తెల్ల షర్ట్ వేసుకోవటం నేను ఎప్పుడొ మనేశాను. లేదు.. నేను వేసుకుంటా అని పట్టు వదలని విక్రమర్కుడులా వేసుకుని బయటికి వెళ్ళారంటే అందరు మనల్ని ఎర్రగడ్డ నుండో లేక nimhan's (బెంగుళురులోని పిచ్చాసుపత్రి) నుండొ పారిపోయి వచ్చాము అనుకుంటారు.

ఇంతకు ముందే చెప్పాను కదా.. వర్షం పడుతుందీ అనీ.... కానీ అది ఎలా ఉంటుందీ అంటే... వర్షం పడిన ఒక గంటకి మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక సారి ఇది తెలియక ఇలాగే.. వర్షం పడినప్పుడు నా స్నేహితుడిని ఒకడిని పట్టుకొని ఏంటి.. వర్షంలో తడిసి వచ్చావా అని అడిగాను. వాడు "ఒరేయ్ సీనుగా నేను చెమటలో తడిసి ఇలా అయ్యి ఉంటే నీకు ఆటలుగా ఉందారా.. నా కొడకా" అని అన్నాడు. అలా ఉంటుంది, వర్షం పడిన ఒక గంట లోపే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక సారి వర్షం పడినప్పుడు నేను నా స్నేహితుండు కలిసి బయటికి వెళ్ళాము. అక్కడ అంటుకున్న బురదను వదిలించుకుంటూ.. వాడిని చూస్తూ ఏంటిరా ఇదీ అని అడిగాను. ఇంక అంతే వాడిలోకి ఒక శ్రీ కృష్ణుడు వచ్చేసి... "ఆత్మ ఒక దేహమును వదలి ఇంకో దేహమును ఎలా చేరుతుందో... అలాగే, బురద కూడా ఒకరిని వదిలి ఇంకొకరిని చేరుతుంది. ఏ బురద ఐతే అంటుకున్నచో.. వదలదో అట్టి బురద చాలా గట్టిదని చెప్పబడును. అట్టి బురద ఒక్కసారి అంటుకున్నచో వదిలించుకొనుట చాలా కష్టం. బురదను నువ్వు వదిలించు కున్నావని అనుకుంటున్నావు కాని, అది అంతా నీ భ్రమ. ఆ బురద నిన్న ఒకరికి అంటుకుంది, ఈ రోజు నీకు అంటుకుంది, రేపు ఇంకొకరికి అంటుకుంటుంది. అట్టి దాని గురుంచి చితించుట తగదు. బురదే సత్యం, బురదే నిత్యం. ఇప్పటితో ఈ బురద పురాణం సమాప్తం" అన్నాడు.

అలా అన్ని కష్టాలు పడి బురదలో బయటికి వెళ్ళటం ఎందుకని..... ఆ మూడు రోజులు TV చూస్తూ గడిపెయ్యాలని ఒక నిర్ణయం తీసుకున్నా. ఇంక అది మొదలు....

పొద్దున్నే మన మహత్తరమైన E TVలో కొత్త తెలుగు సినిమా వేసాడు. కొత్త అంటే... తెలుగు సినిమా పుట్టిన కొత్తలోది అని అర్థం. పోనీ Gemini చూసి తరిద్దం అనుకుంటే... అన్నీ అరవ డబ్బింగు సీరియళ్ళు వేసాడు. అలా పెట్టగానే.... ఆనందం... ఇది ఆనందం అనే సీరియల్ వేసాడు.. ఆ ఆనందం సీరియల్ నా ఆనందాన్ని హరించేసింది. అలా ఆ "కొత్త" సినిమా అయిపోగానే.. ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు మీరు "రుచి అడ్డమైన రుచి.... క్షమించాలి... రుచి అభిరుచి అనే ఒక వింత వంటలను తయరు చేసే కార్యక్రమం చూస్తారు. దయచేసి ఈ కార్యక్రమంలో చూపించిన విధంగా వంటలు తయారు చేసి తిని ఆసుపత్రి పాలు అయినచో దానికి మేము భాద్యులము కాము" అని చెప్పింది.

అలా ఆ కార్యక్రమం ప్రారంభం కాగానే అక్కడున్న TV యాంకరు ఆ రోజు వంట చెయ్యటానికి వచ్చిన అతిధి గురించి చెప్తూ "ఈ రోజు మనం కలవబొతున్న అతిధి పేరు దుర్గ గారు. వీరి గురుంచి చెప్పాలీ అంటే.. ఈమే మాములుగా వంట చెయ్యరు, ఇలాంటి కార్యక్రమాలలో తప్ప. ఇంట్లో వంటలన్నీ వీళ్ళ ఆయనగారే చేస్తారు. ఇప్పుడు దుర్గ గారు చేసే ఈ వింత వంటకం చూద్దాం". చెప్పండి దుర్గ గారు.. ఈ రోజు మీరు చేసే వంటకం పేరు ఏంటి???. "ఈ రోజు నేను చెయ్యబోయే వంటకం పేరు "old is gold". దీనికి ఆ పేరు ఎందుకు పెట్టాను అంటే.. దీనికి కావలసినవి అన్నీ కనీసం రెండు, మూడు రోజులవి అయ్యుండాలి. అంటే మూడు రోజుల కింద కొన్న కూరగాయలు, పాలు etc అన్నమాట. ఇంకొంచెం పాతవి ఐతే ఇంకా మంచిది". అని ఏమేమో చేసి ఒక వింత వంటకం ఆ TV యాంకరు చేతిలో పెట్టి ఇంకా ఏదో చెప్పేలోగానే ఆ యాంకరు ఆ వంటకం తిని కింద పడిపోయింది. అప్పుడు ఆ దుర్గమ్మ తల్లి " దీని కక్కుర్తి తగలెయ్యా... మొత్తం చెప్పే వరకు వినకుండా తినేసింది. ఈ యాంకరులు అంతా ఇంతే... మనం చెప్పింది అసలు వినరు. ఆ వంటంకం, మన ఇంటికి వచ్చిన అతిధులను పారిపోయేట్టు చెయ్యటానికీ, మనం తినటానికి కాదు".

అది అయిపోగానే "పాడనా.... పారిపోయేట్టు" అనే singing competetion మొదలైంది. హమ్మయ్య మంచి talent ఉన్న singers పాడే పాటలు వినొచ్చు అని అనుకున్న. మొదటగా ఒక singer వచ్చి శంకరాభరణం సినిమాలోని పాట పాడబొతున్నా అని అనగానే... ఆహా ఏమి నా భాగ్యం... నాకు నచ్చిన సినిమాలోని పాట వినొచ్చు అనుకుని TV volume పెంచాను. ఆ పాట మొదలైన కొద్ది సేపటికి చూసుకుంటే.... నాకు బాగా చెమటలు పట్టేసి, గుండె దడ మొదలైంది. పైకి తలెత్తి చూసా... fan తిరుగుతూనే ఉంది. ఏంటీ ఇంత చెమటలు పట్టాయి అని చూస్తే... TVలో అతను పాడుతున్న పాట మహిమ అని తెలిసింది. అంత మంచి పాటను అలా పాడుతుంటే వింటున్నందుకు నాకు ఎక్కడ కాశీలో గోవును చంపితే వచ్చే.. గోహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అని భయమేసింది. ఆ తుఫాను వెలిసి నేను కొంచెం తేరుకునే లోగానే.... "నవ్వుతావా..లేక చస్తావా" అనే నవ్వుల కార్యక్రమం మొదలైంది. హమ్మయ్య, కాసేపు నవ్వుకొవచ్చు అనుకున్న. అలా కొద్ది సేపు చూసిన తరువాత.... నా కళ్ళలో నుండి నీళ్ళు రావటం మొదలైంది (అవి "ఆనంద" కన్నీరు అనుకుంటే ఆ "నవ్వుతావా..లేక చస్తావా" కార్యక్రమాన్ని మీరు చూడవల్సిందిగా నా ప్రార్ధన). ఇది చూస్తుండగానే "ఇంకొంచెంసేపు TV చూడు, నువ్వు ఒక అద్భుత అనుభూతికి లోనవుతావు" అని వినిపించింది. చుట్టూ చూసాను... ఎవరూ లేరు... ఏదో నా భ్రమ అనుకొనీ మళ్ళీ TV చూస్తూ ఏడవటం మొదలుపెట్టా.... ఇప్పటికే అన్నీ రకల హత్యలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేను, ఇంక ఎందుకు బ్రతికే ఉన్నాను రా... బాబు అనుకుంటుండగా... ఒక యాంకరు వచ్చి "ఇప్పుడు మీరు, విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడు NTRని మించిన నటన... S.P.బాలసుబ్రమణ్యం, యేసుదాసు etcలని మించిన గాన గాంధర్వుడు... సిరివెన్నెల సీతారామశాస్త్రిని మించిన పాటల రచయిత, త్రివిక్రం శ్రీనివాస్ ను మించిన మాటల రచయిత ఐన సుమన్ గారు... అన్నీ తానే అయి.... నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా... నికృష్టుడి పాత్ర... క్షమించాలి... కృష్ణుడి పాత్ర పోషించిన "బలరామ కృష్ణయుద్దం" సీరియల్ చూడబోతున్నారు.. చూడండీ... చూసి తరించండీ" అని చెప్పింది.

అనుకోకుండా... మా ఇంట్లో కరెంటు పోయింది. హమ్మయ్య అనుకున్నాను. ఇంతకు ముందు ఎన్నో సార్లు కరెంటు పోయినప్పుడు "ఛీ... వెధవ కరెంటు ఇప్పుడే పోవాలా??? అని అనుకునే వాడిని.. కానీ ఆ రోజు మాత్రం చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు మా ఇంట్లోకి చీకటి వచ్చి... నా జీవితంలోకి వెలుగును నింపింది.

తగిలిన దెబ్బకి Dettol రాస్తుంటే ఉండే మంట.... ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందో... అప్పుడే నాకు తెలిసింది.

Monday, June 30, 2008

సీనుగాడు - ఇండియా ప్రయాణం

ఒక మనిషికి సహాయం చెయ్యలేను, లేదు, కాదు అని చెప్పలేకపోవటం వలన ఎన్ని కష్టాలో...

అమెరికాలో వచ్చిన పని పూర్తికావటంతో... ఇండియాకి ప్రయాణ తేదీ decide కావటంతో... పరిచయం ఉన్నవాడు.. లేనివాడు... అందరూ ఎన్నో, ఎన్నేన్నో జన్మల బంధం ఉన్నట్టుగా మాట్లాడటం చూసి నాకు ఇంత సడనుగా పబ్లిసిటీ పెరిగిపోయింది ఏమిటబ్బా... నాకు ఏదో ముడినట్టుంది అని ఎందుకో నా ఆరో ప్రాణం మొత్తుకుంటూనే ఉంది. కానీ మనం వింటేనా...

నా పక్క సీట్లో ఉండే అమ్మాయి.. నేను ఎప్పుడు హయ్ అని చెప్పినా కుడా.. E TV సుమన్ వ్రాసే కథల్లోని హీరోయిన్ కు ఉండే అన్ని కష్టాలు తనకే ఉన్నట్టు... ఒక జీవం లేని నవ్వు నవ్వేది . ఆ అమ్మాయి మాట్లాడకపోయేసరికి.. మనం basic గా విలన్లము.. మనకు హీరోయిన్లు నచ్చరు అని సరిపెట్టుకున్నాను. (సారీ... అలా అనుకోక పొతే మనకు నిద్ర పట్టదు, తిండి కూడా తినము మరి).

ఆ TV సీరియల్ అమ్మాయి కూడా.. నా cabin దగ్గరికి వచ్చీ మరీ.. నాకు good morning చెప్పినప్పుడు కూడా నా ఆరో ప్రాణం "ఒరేయ్ సీనుగా నీకు ఎదో మూడిందిరోయ్ అని". కాని మనం వింటేనా... ఇది అంతా అంతా మన fan following అని ఫీల్ అయ్యాను. ఆ తరువాత కానీ నాకు తెలియలేదు... ఇది అంతా.. నరకం అంటే ఏమిటో నా చేత spelling రాయించడానికి అనీ. కాని అది అంతా నాకు అర్థం అయ్యేలోపు రావలసిన కష్టాలు రానే వచ్చాయి..

ఇండియాకి ప్రయాణ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఈ fan following పెరుగుతూనే ఉంది. ఐనా మనం సీనుగాడు వింటేనా...(మనలో మన మాట.. పుట్టుకతో వచ్చిన కోతి బుద్దులు ఎక్కడికి పొతాయి).

ఒక రోజు అభినవ్ ఫొను చేసి "ఒరేయ్ సీను, ఇండియాకి వెళ్తున్నావంట కదా ... చాలా ఆనందంగా ఉంది రా (నేను ఇండియా కి వెళ్తే వీడికి ఎందుకు ఆనందమో మరీ... వీడిని కంపెనీవళ్ళు మందు, మంచినీళ్ళు దొరకని చోటికి transfer చెయ్య, వీడి onsite cancel అయ్యి గుర్గావ్ కి రాను). నేను నా తమ్ముడికి laptop, iPod, camera కొన్నాను. కొంచెం ఏమీ అనుకోకుండా తీసుకెళ్ళు" అని అడిగాడు. అది కాదు రా.. iPod అంటే OK. కానీ, laptop, camera అంటే కొంచెం లగేజీ ఎక్కువ అవుతుంది కదరా అని అన్నాను. ఇలా అన్నానో లేదో.. వాడు, " ఏరా, ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా?????? నా కొడకా... నువ్వు USలో ఉన్నన్ని రోజులు, నిన్ను అన్ని చోట్లకి తిప్పి చూపించింది ఎవడు రా.. అప్పుడే అన్నీ మరిచిపోయావా???. నీకు luray caverns చూపించటానికి నేను ఎన్ని కష్టాలుపడ్డాలో అప్పుడే మరిచిపోయావా??? తాగేసిన మందు గురించీ, తినేసిన చికెన్ గురుంచీ గుర్తుచేసుకోవద్దు అనీ అడ్డమైన డైలాగులు కొట్టావంటే.. పెట్రోలు రేటు పెరిగింది అని కుడా చూడకుండా.. కారేసుకొని నీ ఇంటికి వచ్చి మరీ తంతా.". "వద్దు లేరా బాబూ నన్ను ఏమీ అనకు. నువ్వు ఇచ్చినవి అన్నీ తీసుకెళ్తాలే. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఇవ్వు" అని యుద్దంలో శత్రువులకి దొరికిపోయిన యుద్ద ఖైదీ లాగా వాడికి నేను లొంగిపోయాను.

ఎలాగు ఇండియాకి వెళ్తున్నాం కదా... shopping చేద్దామని అలా storesకి వెళ్ళాను. "ఒరేయ్ సీనుగా... అని పిలిచినట్టుగా అనిపించింది. ఈ ఎదవ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని వెనక్కి తిరిగి చూస్తే.. జోకర్ ముక్కు శంకర్ గాడు. వీడు నాతోపాటు కలిసి చదివాడు. కాలేజీలో ఉన్నప్పుడు ఒక్కసారి ఐనా వాడు కాలేజీకి వస్తే నాకు వాడి ముఖం నాకు గుర్తుండేది. మొత్తం 3 సంవత్సరాల కాలంలో ఒక పది సార్లు వచ్చిఉంటాడు. ఆ తరువాత ...నాకు మళ్ళి... మేము Atlantic Cityకి వెళ్ళినప్పుడు కలిసాడు. వాడు కలిసీ కలవగానే.. ఒరేయ్ సీను, నువ్వు ఇండియాకి వెళ్తున్నావని తెలిసింది రా.. అందుకే shoppingకి వచ్చాను. ఏంటి నువ్వు కూడా shoppingకే వచ్చావా?? అని అన్నాడు. నేను ఇండియాకి వెళ్తుంటే వీడు shoppingకి వచ్చడు అనగానే, అప్పుడే నా బుర్ర వెయ్యి వోల్టుల బల్బులా వెలిగింది. వీడు నాతో ఎదో ఒక 20KGల బ్యాగు ఒకటి ఇండియాకి తీసుకెళ్ళేలా అంతర్జాతీయ కుట్ర పన్నబోతున్నాడనీ.

లేదు రా... ఇక్కడ ఉన్న చెత్త ఊడవటానికి వచ్చాను.. కొంచెం నాకు సహాయం చెయ్యగలవా అని అన్నాను.. నువ్వు ఏమి మారలేదు రా... అప్పటి నుండీ ఇప్పటి వరకూ.. అది సరేగానీ ఏమి కొందామని వచ్చావు?? అని అన్నాడు. వీడు నాకు ఇలా తగులుకున్నాడేమిటి రా బాబు... అని నాలో నేను తిట్టుకోవటం మొదలుపెట్టాను. ఇంక వాడు అడుగుతున్న ప్రశ్నలకు అడ్డుకట్ట వెయ్యాలని... ఏమి లేదు రా.. మా కంపెనీ వళ్ళు నన్ను ఇండియాకి వెళ్ళిన తరువాత.. ఆఫ్రికాకి పంపిస్తా అన్నారు. అక్కడ బ్రతకాలంటే.. అక్కడున్న ఆఫ్రికా జాతి కోతులనీ, కొండముచ్చులనీ మచ్చిక చేసుకోవాలి అంటా... అందుకనీ వాటి కొసం T-Shirt, Jeans కొందామని వచ్చాను అని చెప్పి.. అక్కడున్న జనంలో కలిసి పొయాను, వాడికి నేను చెప్పింది అర్థం అయ్యేలోపు. shopping చేస్తున్నంతసేపు ఎవడో ఒకడు తెలిసిన వాడు తగలటం... వాడు నేను ఇండియా వెళ్తున్నానని నాకు గుర్తుచెయ్యటం.. పనిలో పనిగా.. ఏదో ఒకటి తీసుకెళ్ళమని చెప్పటం...

ప్రయాణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ... వీళ్ళ గోల ఇంకా ఎక్కువ అవుతూ వచ్చింది... ఒకడేమొ ఒక పెద్ద బ్యాగు ఇచ్చేసి తీసుకెళ్ళు అని అంటాడు.. అప్పుడు అనిపించింది... ఛీ.. నా జీవితం... నేను US కి ఎందుకు వచ్చాను రా దేవుడా అనీ.... ఆ లగేజీ మొసుకెళ్ళే వాడి గురుంచి అసలు పట్టించుకోరు. ప్రతీ ఒక్కడూ నా ఒక్కడిదే కదరా బాబూ అనే అంటాడు. ఒకడైతే ఏకంగా వాడి లగేజీ ఎలా మోసుకెళ్ళాలో DEMO (ఇక్కడ DEMO అనగా acting కుడా చేసి చూపించటం. ఇక్కడ నేను అది చేసి చుపించలేను. అందుకు నన్ను క్షమించాలి)కూడా ఇచ్చాడు. దాని సారాశం "ఏముంది రా బాబు నువ్వేమైనా తలపైన పెట్టుకుని తీసుకెళ్తున్నట్టు OA (Over Action) చేస్తావ్. ఇక్కడ ఎలాగు carలోనే వెళ్తావ్, అక్కడ airportలో దిగగానే మళ్ళీ car తీసుకొని ఇంటికి వెళ్ళి పోతావు కద రా??

వీళ్ళ తాకిడి తట్టుకోలేక.. అప్పులోళ్ళ నుండి తప్పించుకు తిరుగుతున్నట్టుగా తిరగటం మొదలు పెట్టా. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదనీ... అప్పుడెప్పుడో మరిచిపోయిన స్నేహితులు కుడా నాకు కలవటం మొదలు పెట్టారు. వాళ్ళు కలిసినందుకు ఆనందపడాలో లేక వాళ్ళు నాకు ఇండియాకి తీసుకెళ్ళటానికిస్తున్న లగేజీని చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితి నాది.

airportలో దిగగానే.. నన్ను చూసి అందరు ఏ మూటలు మోసే కూలీ అనుకుంటారేమో అని నా భయం. ఇప్పుడు ఏమిటి నా కర్తవ్యం(ఏదో సినిమా డైలాగులాగా... విజయశాంతిని అడుగు అని మాత్రం నాకు చెప్పొద్దు... ప్లీజ్. ఇప్పుడు నేను ఏడుస్తే.. నా కనీళ్ళకి ఇంకో మహా సముద్రం ఏర్పడుతుంది). నాకు మటుకు ఇలాంటి వాళ్ళందరిని అండమాన్ జైలుకు పంపించాలని ఉంది.

airportలో boarding pass తీసుకుందామని counter దగ్గరికి వెళ్ళగానే.. అక్కడున్న అందమైన అమ్మాయి.. సారీ, మీలాంటి కూలీలు గేటు బయటే ఉండి లగేజీ ఇచ్చేసి వెళ్ళిపోవాలి, అంతే కానీ ఇలా లోపలి వరకు రాకుడదు అన్నది. "ఛీ.. నా జీవితం.... అనుకున్నదంతా అయ్యింది. దీని కన్నా ఆ అమ్మాయి నన్ను అన్నయ్యా అని పిలిచినా బాగుండేది. నా మనసుని ఎలాగోలా manage చేసేవాడిని. ఇంక అప్పటికప్పుడు. నాకు ఏ కారు కిందో పడి చచ్చిపోవాలని అనిపించింది. వెంటనే నా friendకి ఫోను చేసి "ఒరేయ్, నేను ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్తున్నా. బ్రతికుంటే మళ్ళీ కలుద్దాం అని చెప్పి, దగ్గర్లో ఉన్న కారు కింద పడటానికి తయారయ్యాను".

Tuesday, May 27, 2008

తిండీ - తిప్పలు

నేను పుట్టీ, నాకు ఊహ తెలిసినప్పటి నుండి.. ఏ రోజు కుడా తిండికి ఇంతలా కష్టపడలేదు. ఎందుకంటే, నేను ఎప్పుడూ మా ఇల్లు వదిలి బయటికి రాలేదు. బయటికి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు కుడా నేను మన బెంగుళూరు మహానగరంలోనే ఉన్నాను. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా నాకు ఏ ఇబ్బందీ రాలేదు. కానీ గుర్గావ్ (అదేనండీ.... నా భాషలో నరకం)లో ఉన్న గత సంవత్స్తర కాలంలో ఎన్నో సార్లు తిండికి కష్టపడవలసి వచ్చింది.

గుర్గావ్ కి వచ్చి కంపెనీ guest houseలొ దిగిన రోజు. భోజనం చెయ్యటానికి వెళ్ళి వాడు పెట్టింది తినగానే... కళ్ళ ముందు రింగులు రింగులు తిరిగి నేను ఇంట్లో ఉన్నప్పటి రోజులు కనిపించాయి..

****************** flashback మొదలయ్యింది ***********************

స్థలం : మా ఇల్లు, హైదరాబాదు

మన సీనుగాడు భోజనానికి కూర్చున్నాడు. ఆ రోజు అమ్మ చేసిన వంటలు నచ్చలేదు.. ఇంక అంతే... చేతిలో ఉన్న ప్లేటు, తెలుగు సినిమాల్లో హీరో విలన్ని కొడితే గాల్లో ఎన్ని పల్టీలు కొడుతుందో.. అన్ని కొట్టింది. ఆ తరువాత మన వాడిలోకి సాయి కుమార్ వచ్చేసి... హెయ్ అగ్నీ అని ఒకటి రెండు సార్లు అనేసి.... ఇల్లు పీకి పందిరేస్తాడు.

********************* flashback అయిపోయింది *******************

ఇంక ఊహల్లో నుండి బయటికి వచ్చి.. అక్కడి ప్లేటుని కుడా అలగే గాల్లోకి విసిరివేద్దమనిపించింది ..... కానీ ఆ తరువాత.... నన్ను అక్కడ ఉన్నవాడు అలాగే చేస్తాడేమొ అని భయమేసి ఏమీ అనలేదు. ఇంకా వాడు నాకు ఒక రోజు హైదరాబాదు బిర్యానీ అని చేసి పెట్టాడు, దాన్ని తిన్న తరువాత ఒకటి అనిపించింది. హైదరాబాద్ లోని బావర్చి బిర్యానికి అలవాటుపడ్డ కుక్క కుడా అది తినదు అనీ.
దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే వంకాయ అయ్యిందంటా...అలా కొన్ని నెలలు గడిచిన తరువాత... నా జీవితం కూడా అలాగే అయ్యింది.... ఎందుకంటే.. ఈ మధ్యే కంపెనీ guest house నుండి బయటికి వచ్చాను.. ఇంక నేను తిండికి పడే తిప్పలు ఒక్కటి కాదు.

నేను ఉండే రూముకి చుట్టుపక్కల కనీసం ఒక కిలోమీటరుకి దగ్గరలో ఒక పెద్ద భుతద్దం పట్టుకొని వెతికిన కూడా మంచి పెద్ద షాపు కనపడదు. అక్కడ ఉన్నది ఒకే ఒక్కటి. అందుకనీ ఇంక ఆ షాపు వాడు ఇచ్చే బిల్డ్డప్పు చూడాలి... వాడు మమ్మళ్ని ఏదో ఉద్దరిస్తున్నట్టు.

ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే.... నాకు చిన్నప్పటి నుండీ కుక్కలు అంటే చచ్చేంత భయం... దీనిని ఇంగ్లిష్లో ఏ ఫొబియా అంటారో తెలియదు..... కానీ నేను మాత్రం కుక్కల భయం అనే చెపుతాను. ఇది అంతా ఎందుకు చెపుతున్నాను అంటె... ఆ షాపుకి దగ్గర ఒక పెద్ద కుక్క ఉంటుంది. దానికి ఆ షాపు వాడు పెట్టీన పేరు.... TIGER. వాడు ఏ ముహుర్తంలో దానికి ఆ పేరు పెట్టాడొ కానీ.. అది మాత్రం సార్ధక నామధేయురాలు. అలా ఎందుకు అన్నాను అంటే... అది నిజంగా పులిలాగే ఉంటుంది. ఇంకేముందీ... నాకేమో కుక్కల భయం అక్కడేమొ... ఒక మనిషిని ఒక్క పుటకే తినేసేటట్టుండే కుక్క. దానికి తోడు ఈ మధ్య దానితో ఇంకో కుక్క స్నేహం చేసింది. వాటి స్నెహమేమో కానీ.. అది నా చావుకు వచ్చింది. ఎందుకంటే.. రెండు ఒకేల ఉంటాయి చూడటానికి. అందుకని...వాటిని గుర్తుపట్టటానికి, నేను నా కోడ్ భాష వాడుదాం అని అనుకున్నా. దాని ప్రకారం వాటికి పేర్లు కూడా పెట్టాను... తోక ఉన్న కుక్క, తోక లేని కుక్క. పోని దాన్ని నా దారిలోకి తెచ్చుకోవాలీ అంటే... మనకు language problem. దాని భాష నాకు రాదు.. నా భాష దానికి అర్థం కాదు. అదీ కాక.. కుక్కల భాష నేర్పించే institute's కుడా ఇక్కడ చుట్టుపక్కల ఏమీ లేవు. ఐనా.. మంచి food కుడా దొరకని చోట కుక్కల భాష నేర్పించే institute వెతకటం ఎలా ఉందీ అంటే... మంచినీళ్ళు కుడా దొరకని ఎడారిలో.. మందులోకి side dish కోసం తిరిగినట్టుగా ఉంది.

అందుకే... ఏదైన కొనాలీ అంటే చీకటి పడ్డ తరువాత ఒక కోటి రూపాయలు ఇచ్చినా కుడా వెళ్ళొద్దు అనీ, వెళ్ళి ఆ కుక్కలకి ఒక పూట భోజనం కిందకి అవకూడదనీ... ఒక భీష్ముడి షపథం చేసుకున్నా.. అలా చేయ్యకుంటే, మా మందులోకి సైడ్ డిష్ కని వెళ్ళి, దానికి సైడ్ డిష్ ఐపోతమని అలా చెయ్యవలసి వచ్చింది. దానికి తొడు ఆ షాపు దగ్గరికి వచ్చేవాళ్ళు దాన్ని TIGER అని ముద్దు ముద్దుగా పిలిచి దాన్ని రెచ్చెగొడుతుంటే ఇంక నా ప్రాణలు గాల్లోనే పోయినంత పని అవుతుంది.

ఈ అనుభవాలతో ఒక్కటి మాత్రం తెలిసింది... కుక్కలు అనేవి సింహం, పులుల కన్నా భయంకరమైనవి. ఎందుకంటే, వాటిలోకి ఏప్పుడు సాయికుమార్ వచ్చి, అగ్నీ... ఆ అని అంటాడొ తెలియదు. దీన్ని నా diaryలో నేను ఎప్పుడో రాసుకున్నాను.

ఇంక మా కంపెని food court లో ఐతే.. ఒక రెండు వందల రూపాయలు తగలేసినా కుడా వాడి బొంద లాటి భోజనం పెడతాడు. ఇంక ఏ మసాల దోసో తినాలి అంటే... వాడికి ఒక వంద కట్నం గా చదివించుకోవలసిందే. ఇక్కడ బ్రతకాలి అంటే నాకు వచ్చే జీతం సరిపోదు, ఎదైనా ఇంకో part time జాబ్ చూసుకోవాలి . నా office timings తరువాత రొడ్డు మీద ఏ శెనగలో, బటానీలో అమ్ముకోవాలి. కానీ, మరీ బ్రహ్మీ సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయ్యుండీ.. అవి అమ్ముకుంటే బాగుండదు అనీ, ఆ part time జాబ్ కి application పంపించలేదు. ఈ మధ్య ఆ food court వాడు నేను చెప్పింది పట్టించుకోవటం లేదు. దానికీ ఒక కారణం ఉంది.., ఒక రోజు South Indian Thali అనే food item ఆర్డరు చేసి తినటం మొదలు పెట్టానో లేదో.. ఎదో తేడాగా అనిపించి వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటిది, అప్పడంకు sound drivers install చేయ్యలేదా??? తింటే అసలు sound రావటం లేదు. rice కి కరక్ట్ font లేదు. 10px ఉండవలసింది... 12px పెట్టినట్టున్నావు. size కొంచెం పెద్దదైంది ఇంకా font-family & font-color మంచిగా లేదు కొంచెం మార్చు అని వాడిని మన భాషలో తిట్టాలి అనిపించి వాడి వరకు వెళ్ళి వచ్చెసాను. నేను ఎందుకు వచ్చి వెళ్ళిపోయానో తెలియక నన్ను పిచ్చి వాడిని చూసినట్టు చూసాడు. ఇంక అంతే... ఆ రోజు నుండి వాడు నేను చెప్పింది వినుపించుకోవటం మానేసాడు.

సరిగా తిండి కూడా తినకుంటే...ఎందుకు ఈ చదువులు....ఈ ఉద్యోగాలు...

ఇలా అందరి దగ్గర అడ్డమైన food తినీ, ఒక నిర్ణయానికి వచ్చేసా... నేనే వంట చేసి(నేను వంట బాగానే చేస్తానులేండి) వాళ్ళకి తినిపించి... వంట అంటే ఇలా చేస్తారు అని గట్టిగా ఒకటి కొట్టీ మరీ చెప్పాలని ఉంది. అదీ కూడా కుదరకపోతే.. నేనే ఒక soutun indian రెస్టారెంటు ఒకటి పెట్టేస్తా...

ఆ రోజు కోసం ఎదురుచూసున్నాను... అది ఎఫ్ఫుడు వస్తుందో....

Saturday, January 26, 2008

అమ్మో.... వీకెండ్

నో.. నన్ను పంపించెయ్యండి.. నేను ఇక్కడ ఉండను అని గట్టిగా కలవరిస్తూ.. నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచాడు మన సీనుగాడు ఉరఫ్ శ్రీనివాస్.. గుర్గావ్ వచ్చి దాదాపు 10 నెలలు కావస్తుంది. బెంగుళూరు పంపిస్తాం అంటారు కానీ అది ఎప్పుడొ చెప్పరు. బెంగుళూరులో ఎవరో ఒకరిని వెతికి పట్టుకొని ప్రాజెక్ట్ లోకి తీసుకు వచ్చి, ఇద్దరు కలసి అక్కడి నుండి పని చేస్తా అంటే పంపిస్తాం అంటున్నారు. అది జరగటం కాదు అని అనిపిస్తుంది.. ఇలా నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచి పడటానికి కారణం.. వీకెండ్.. అవును నిజంగానే వీకెండ్. ప్రతీ సాప్ట్వేర్ ఇంజనీర్ లాగే నేను కుడా వీకెండ్ కోసం ఎదురు చూసే వాడినే...కానీ ఇప్పుడు వీకెండ్ అంటెనే.. అది ఎదో హార్రర్ సినిమాలాగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని నెలల ముందు వీకెండ్ అంటే.. ఎంజాయ్ చెయ్యటం. కానీ ఇప్పుడు.. అది ఒక గుండెని పిండి జ్యూసు చేసి తాగుతున్నంత బాధ (సెంటిమెంటు కోసం వాడాను అంతే).
**********************************************************************************************
స్థలం : బెంగుళూరు
సమయం : ఎదో ఒకటి రాసుకోండి
కొంచెం పనిలో ఉన్నప్పుడు (నిజంగానే పనిలో ఉన్నానండీ బాబు ) ఫోన్ రింగ్ అయ్యింది... "నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెపుతున్న.." రింగ్ టోన్. ఎవరా అని చూస్తే.. ఐదు పైసల ముఖం చందుగాడు (మేము అలాగె పిలుస్తాం.. ఎందుకంటే వాడి ముఖం అలాగే ఉంటుంది), అప్పుడే అనుకుంటున్నా ఎమిటి ఇంకా వీడు ఫోన్ చెయ్యలేదు అని... "చెప్పు రా చందు అని అనగానే... ఇప్పుదే సాగర్ గాడికి ఫోన్ చేసాను వాడు సాయంట్రం 7 గంటలకి నీ రూం కి వస్తా అని చెప్పాడు, అలాగే మన అర గుండు దివాకర్ గాడు కూడా వస్తా అని చెప్పాడు. నేను కుడా వస్తా...." అని పెట్టేసాడు. ఇదీ మాకు ప్రతీ శుక్రవారం ఉండేదే... ఇది అంతా.. వీకెండ్ ప్లాన్. ఇక శుక్రవారం మొదలు అయ్యే మా కుంభమేలా (మేము ప్రతి వీకెండ్ చేసుకునే పండగ.. .మేము అలాగే పిలుస్తాము). అలా శుక్రవారం మొదలైన మా పండగ సోమవారంతో ముగుస్తుంది... ఇలా మూడు రొజులు తాగింది దిగాటానికి...తిన్నది అరగటానికి సోడాలు గట్రా తాగి.......మళ్ళీ తరువాత వీకెండ్ కి ప్లాన్లు వేస్తూ... ఆఫిసుకి వెళ్తాం.
***************************************************************************************
స్థలం : గుర్గావ్(నా బాషలో నరకం... మీకు నచ్చింది మీరు రాసుకోండి)
సమయం : సుమారుగా గత 10 నెలల నుండీ ఇక్కడే ఉంటున్నా.. కాబట్టి, సమయంతో పని ఏమి ఉంది
ఒక రెండు మూడు వారాలు బీచ్లో (మా కంపెనీలో బెంచ్ ని ఇలాగే పిలుస్తాం) ఉండే సరికి పిచ్చి ఎక్కిపొయింది..ఇలా కాదు కానీ..ఎదో ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోవాలి అని అనుకొనగానే.. ఒక ప్రాజెక్ట్ లో ఒకరికి ఖాళి ఉంది అనగానే.. కొతికి కొబ్బరి దొరినంత సంబరపడిపొయాను, కానీ అది గుర్గావ్(ఢిల్లీ దగ్గర) అని అనగానే.. సరేలే నార్త్ ఇండియా చూసినట్టుగా ఉంటుంది అని OK చేప్పేసా.(కానీ తన జీవితం స్టాలిన్, ఒక్క మగాడు సినిమాలలోని మలుపుల కన్న గొప్ప మలుపు తిరుగుతుంది అని తెలియదు పాపం. మన సీను గాడికి ... అంటే ఎవరో అనుకునేరు... నేనే).
ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడ ఉన్న facilities అన్ని చూసి, నాలో నేను, "అనుభవించు రాజా" అని పాట పాడుకున్న. కొన్ని రోజుల తరువాత "ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను" అని పాడుకోవలసి వస్తుంది అని అనుకోలేదు.
ఇక్కడికి వచ్చే ముందు... ఇక్కడికి వచ్చిన కొత్తలో.. ఇక్కడి అన్ని visiting places చూద్దాం అని అనుకున్నా.. కానీ.. ఇక్కడికి వచ్చిన తరువాత తెలిసింది, ఇక్కడి transport ఎంత దరిద్రమో.. ఇక్కడి నుండి ఎటు వెళ్ళాళి అన్నా.. రిక్షానే గతి.. నేను చేప్పేది నిజమండీ బాబు.. ఎంత నిజం అంటే.. స్టాలిన్, ఒక్క మగాడు సినిమాలు box office హిట్లు అన్నంత నిజం. (కావాలి అంటే.. ఆ సినిమాల నిర్మాతలని అడగండి, అప్పటికీ మీకు డౌట్ గా ఉంటే, దగ్గరలోని డాక్టరుని సంప్రదించ వలసిందిగా నా మనవి ).
అప్పటికీ.. బయటికి వెళ్దామని అనుకున్నమా... అలా రోడ్డు వెళ్ళగానే.. రిక్షాలు అన్నీ ఒక లైన్లో ఉంటాయి.. మనం వెళ్ళగానే....ఆ రిక్షా వాడు హిందీలో, "కిదర్ జానా హై సాబ్" అంటాడు.దీనినే తెలుగులో, "నేనే రా నీకు దిక్కు.. ఇవ్వాళ నీకు గుండే...ఈ చుట్టు పక్కల నీకు ఎక్కడ వెతికినా, బస్, ఆటో కానీ ఏదీ దొరకదు". అలా చచ్చీ, చెడీ అన్ని రకాల బస్సులు, ఆటోలు ఎక్కి ఎక్కడికి ఐనా వెళ్ళామో.. మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కన్నా.. అక్కడే ఉండి పోవాలి అనిపిస్తుంది, ఎందుకంటే, రావటం ఇంకా కష్టం. అలా బయటికి వెళ్ళే ముందు, మంచి తెల్లటి డ్రెస్ వేసుకున్నామో, ఇంక అంతే, ఇక్కడ దుమ్ముకీ వేసుకున్న ఐదు నిమిషాలకి అది నల్లగా మారకుంటే, నేను వాడే surf excel మీద ఒట్టు. అందుకే, నేను ఈ placeకి ఒక కొసరు పేరు తగిలించా, అది "గుర్గావ్ - సిటీకీ తక్కువ ఏడారికి ఎక్కువ" .
సరే, బయటికి ఎలాగు వెళ్ళటం కష్టం అని అనుకున్న తరువాత (అంటే.. పట్టువదలని విక్రమార్కుడిలాగా కొన్ని సార్లు వెళ్ళి వచ్చిన తరువాత), TV చూసి వీకెండ్ అయిపోగొడదాం అని అనుకున్నాను. అలా అనుకోవటం నా జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది అనుకోలేదు. ఒకసారి ధైర్యం చెసి TV చూడటం మొదలు పెట్టాను. ధైర్యం అని ఎందుకు అన్నాను అంటే, నేను ఉండే కంపనీ guest houseలో ఒకే ఒక తెలుగు చానెల్ వస్తుంది, అది కూడా.. తెలుగు వాడు అయి పుట్టిన వాడు ఎవడూ కూడా చూడని మహత్తరమైనది, ఇంక అనుమానం ఎందుకూ అది మన E TV. ఒక రెండు మూడు వారాలు అది చూసాకా.. అందులో వచ్చే programs కన్నా, నా చిన్నప్పుడు, DD 1లో (దానినే మనం అందరం, ప్రేమతో దూలదర్షన్, క్షమించాలి... దూరదర్షన్ అనే వాళ్ళాం) వచ్చే పందుల పెంపకం బాగుంటుంది అని. ఎందుకంటే అది ఒక అర గంట మాత్రమే వచ్చేది, కానీ ఇందులో వచ్చే సీరియల్స్ ఎన్ని సంవత్సరాలు అయిపోవు.. ఐన నా పిచ్చి కానీ, మనల్ని చంపటానికే కదా అవి పుట్టింది.
ఇక్కడ ఉన్న PVR ఇంకా Malls వాళ్ళకి, రజనీకాంత్, చిరంజీవి తప్ప వేరే south indian హీరోలు తెలియదు. అందుకే కొత్త తెలుగు సినిమాలు చూడటం ఎప్పుడొ మానేసా(ఐనా.. ఈ మధ్య అన్ని box office హిట్లే కదా మన తెలుగులో.. ఇది నిజం అని నమ్మిన వాళ్ళు సమీప డాక్టరుని సంప్రదించ వలసిందిగా మనవి ).
బెంగుళూరులో వీకెండ్ నీ, ఇక్కడి వీకెండ్ నీ పోల్చి .. అన్నీ గుర్తుకు వచ్చి.. కళ్ళలో నుండి.. మేము అందరం తాగిన... బీర్లు, విస్కీ(దీనినే మేము దగ్గుమందు అని కూడా అంటాం....), సోడలు, జ్యూసులు కారుతున్నాయి..
ఈ అనుభవంతో... గుర్గావ్ లో బ్రతికిన వాడు, ఆఫ్రికా అడవుల్లో, సహరా ఎడారిలో కూడా బ్రతకగలడు అని నా డైరీలో ఎప్పుడొ రాసుకున్నా..