Friday, June 26, 2009

ఇంతకీ.... నేను వదిలిన అక్షరం ఏదీ????


పోయిన వారం మా కోతుల గుంపులో తెలుగు భాష గురించి చర్చ జరిగింది. దాని మధ్యలో మా సంతు గాడు.... "మీవి అన్నీ వట్టి మాటాలేరా... సరి ఐన తెలుగు రాని మీకు తెలుగు గురించి మాట్లాడే అర్హత లేదు. తెలుగు వ్యవహారిక, గ్రాంధికం లో ఎవరికీ అంత ప్రావీణ్యం లేదు" అన్నాడు.

వాడు అన్న మాటకు నాకు చాలా అవమానం అనిపించి తెలుగు దేశంలో, తెలుగు వారింట పుట్టి, తెలుగు మాధ్యమంలో చదివి తెలుగు రాదు అనిపించుకొంటిని. ఛ.. ఇంత అవమానం తరువాత.. మనుటయా.... లేక మరణించుటయా అని ఆలోచించి... మరణించుటయే అని డిసైడ్ అయ్యి ప్రాయోపవేశానికి సిద్దం అయ్యాను.

సంతు గాడి మాటలు విన్న మా సాగర్ గాడికి బ్లడ్ బాయిలింగు పాయింటు దాటినట్టుంది. అంతే... "ఒరేయ్ సీనుగా!!!! ఆగాగు" అన్నాడు. "సంతుగా!!!!! ఏమంటివి... ఏమంటివి..... తెలుగు భాష నెపమున మన సీను గాడికి పాండిత్యము లేదందువా... ఎంత మాట ... ఎంత మాట. ఇది తెలుగు భాషా పాండిత్యమునకు సంబంధించిన పరీక్షయే గాని ఇంక దేనిది కాదే. కాదు... తెలుగు భాషా పాండిత్యమునకు సంబంధించిన పరీక్షయే అందువా.. అట్లైన.... వాడు చదివిన సుమతీ శతకం, వేమన శతకం ఏ భాషలోనివి. తెలుగులోనిది కాదా. నాతో చెప్పింతువేమిరా.... ప్రతి రోజు చదివే ఈనాడు పేపరు తెలుగులోనిది కాదా. ఇంత ఏల.... వాడు వ్రాసే బ్లాగు పోస్టులు తెలుగులోనివి కాదా. కాగా నేడు వాడి తెలుగు పాండిత్యమును గురించి వ్యర్థవాదమెందులకు" అన్నాడు.

సాగర్ గాడు చెప్పిన మాటకు నాకు ధైర్యం వచ్చి.... నా ప్రాయోపవేశాన్ని పెండింగులో పెట్టాను (ప్రాయోపవేశం అంటే ఏమిటి అని నన్ను అడగొద్దు. అడిగినా నేను చెప్పను. కావాలంటే... 9వ తరగతి తెలుగు పుస్తకంలో "ధుర్యోధనుడి ప్రాయోపవేశం" అనే పాఠం చదువుకోండి).

అప్పుడు సంతు గాడు "నాయనా సాగర్!!!!! తెలుగు రాయటం, చదవటం వచ్చినంత మాత్రాన తెలుగులో పండితులు కాలేరు. అచ్చులు, హల్లులు, గుణింతాలు చక్కగ వచ్చినవారు, తప్పులు లేకుండా అక్షరాలు రాసే వారు పండితులు, పాండిత్యం కలవారు అని నా అభిప్రాయం" అన్నాడు.

అప్పుడు సాగర్ గాడు "ఓహో.... అటులన.... అచ్చులు, హల్లులు మరియు గుణింతాలలో ప్రావీణ్యమా పాండిత్యానికి అర్హతను నిర్ణయించునది.... ఐతే మన సీనుగాడి చేత నేడు గుణింతాలలో మొదటిది ఐన "క" గుణింతము రాయించి నీ చేత సీను గాడు పండితుడు, తెలుగు భాష యందు పాండిత్యం కలవాడు అనిపించెదను. సోదరా ప్రవీణ్... Reynolds కలమును, స్వచ్చమైన తెల్ల కాగితమును వేగముగ తెమ్ము. సతీష్, పోటికి సంబంధించిన ఏర్పాట్లు చేయుము. మిలిగిన స్నేహితులారా మన సీను గాడిని పోటీకి ప్రోస్తహించి వీర తిలకమును దిద్దుడు. ఈ ఎడారి ప్రాంతమందున, సకల స్నేహితుల మధ్యమున, సర్వధ, శతధ, శతధ సహస్రధ మన సీనుగాడికి తెలుగులో పాండిత్యము లేదు అను మాటను శాశ్వతముగా ప్రక్షాలన గావించెద" అన్నాడు.

అప్పుడు ..... ఆ పోటిలో నేను రాసినది చూసి మా సంతు గాడు.... క్రింద పడి మరీ నవ్వి, నవ్వి..... నవ్వి. ఇంకేదో తక్కువ అయ్యింది అన్నాడు.

"క, కా, కి, కీ, కు, క్కు, కూ, కె, కే, కై, కృ, కౄ, కొ, కో, కౌ, క్క, కఁ, కః".
ఇంతకీ నేను వదిలిన అక్షరం ఏదీ????