Sunday, November 2, 2008

పెళ్ళికి వెళ్తూ పిల్లిని.......



పెళ్ళికి వెళ్తూ పిల్లిని వెంటపెట్టుకెళ్ళటం అనేది పాత సామెత... నా అనుభవంతో దాన్ని నేను మార్చి నా సామెతల పుస్తకంలో ఈ మధ్యనే రాసుకున్నా...

***************************************************************************************************************

దీపావళికి ఇంటికి రమ్మనీ ఒకటే ఇంటి దగ్గరి నుండి గోల. ఇంటికి ఫోను చేసిన ప్రతీసారీ నా మెదడును ఫ్రై చేసుకొనీ తినేస్తున్నారు. "అది కాదు అమ్మా.... మొన్నే రెండు నెలల క్రిందే కదా వచ్చింది. ఇప్పుడు flight చార్జీలు పెరగటం వల్ల నా క్రెడిట్ కార్డు బిల్లు Rs.999121943432121.99 వచ్చింది. నువ్వు మళ్ళీ దీపావళి పెద్ద పండగ కదా రావలసిందే అంటే ఎలా అమ్మా??? సరేలే చూస్తాను" అని ఫోను పెట్టేశాను. flight బుక్ చేసుకుందామని www.makemytrip.com ఓపెన్ చేసి డిల్లీ నుండి హైదరాబాదు కి టిక్కెట్ రేటు చూసా.... అలా కిందపడి పోయాను. నా పక్కనే ఉన్న సిద్దు గాడు నీళ్ళు చల్లి నన్ను లేపి ఏమయ్యిందని అడిగాడు. అప్పుడు నేను "ఆ flight రేట్లు చూడరా బాబు.... Rs.999898493.99 అంటా. వీపు "విమానం" మోత మోగటం అంటే ఇదేనేమో?????" అన్నాను.

వెంటనే సాగర్ గాడికి ఫోనె చేసి విషయం చెప్పా. వాడు " ఒరేయ్ సీనుగా... ఆ సిద్దుగాడితో కలిసి తిరగకు రా.. నువ్వు కుడా వాడి లాగా అయిపొతావు అంటే విన్నావు కాదు" అన్నాడు. అది సారే గానీ ఇప్పుడు ఎమిటి చెయ్యటం అని అడిగాను. అప్పుడు వాడు "ఆగురా... నా అరికాలు కొంచెం గోక్కోనీయి..... ... ఆ అయిడియా..... ఆ సిద్దు గాడితో స్నేహం చెయ్యటంవల్ల డిల్లీ నుండి హైదరాబాదుకి రైలు మార్గం ఉన్నదనే విషయమే మర్చిపోయావు చూసావా.. ఇప్పుడు అన్నీ Waiting Listలే ఉండి ఉంటాయి. కాబట్టి Tatkalలో ప్రయత్నించు. ఆ "విమానం" మోత ఉండకూడదు అంటే ఈ సారికి రైళ్ళో వెళ్ళూ" అన్నాడు.

సాగర్ గాడు చెప్పినదాంట్లో కొంచెం నిజం ఉంది అనిపించింది. "ఈ సిద్దుగాడితో స్నేహం చేసి ఇలా తయ్యారయ్యాను" అనుకున్నాను. నేను రైలు టిక్కట్టు బుక్ చేసుకుందామని అనుకునే సరికీ ఈ సిద్దుగాడు నాతో హైదరబాదు కి వస్తా అని కింద పడి పొర్లాడుతూ ఏడ్వటం మొదలుపెట్టాడు. "అది ఏంటి రా సిద్దు.. నువ్వు Spice Jetలో టిక్కెట్టు బుక్ చేసుకున్నవనుకుంటా కదా... మళ్ళీ ఇప్పుడు నాతో రైళ్ళో వస్తాని ఏడుస్తున్నావ్...." అన్నాను. "అది కాదు రా సీను... నేను బుక్ చేసుకున్న flight cancel అయ్యింది అని ఇప్పుడె SMS వచ్చింది. దానికి వాళ్ళు కారణం ఏమీ చెప్పలేదు" అన్నాడు. "ఒరేయ్.... నా ముందు తింగరి వేషాలు వెయ్యకు... ఇప్పుడే మా సాగర్ గాడు చెప్పాడు..... ఎవడో సిద్దు అనేవాడు ఆ flightAలో వస్తున్నాడు అని... ఆ flight cancel చేసారంటా.... ఆ తింగరి సిద్దు గాడివి నువ్వే అని మాకు బాగా తెలుసు. పోయినసారి నువ్వు ప్రయాణించిన GoAir కంపెని.. నీ స్వర్ణ చరణపు దెబ్బకి, నీ తింగరి చేష్టలకీ మూసుకున్నాడు. Spice Jet వాళ్ళు చాలా అదృష్టవంతులు. నీ చరణపు మహత్యం, నీ తింగరి చేష్టలు ముందే తెలిసి జాగ్రత్తపడుతున్నారు" అన్నాను.". అప్పుడు వాడు "ఒరేయ్ సీను నువ్వు నన్ను ఊరికే తింగరి సిద్దు అని పిలవటం ఎమీ బాగాలేదు రా.. నేను ఎమీ చేసాను అని అలా పిలుస్తున్నావు రా???" అన్నాడు. ఇప్పుడు నీకు కారణం కావాలి అంటే... నువ్వు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే... ఫ్లాష్ బ్యాక్ అంటే రింగులు రింగులు తిరగాలి అంటావ్ కాబట్టి... ఇప్పుడు వచ్చేది దీపావళి పండగ కదా... అందుకే భూచక్రాలు వాడుకో...

***************************************************************************************************************

మేం 8th క్లాసులో ఉన్నప్పుడు మా క్లాసులో "చంద్రకళ" అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి మా సిద్దుగాడు లైనేసేవాడు. మాకు మాత్రం వాడు ఆ అమ్మాయిలో ఏమి చూసి ప్రేమించాడో అర్థం కాక అదే విషయం వాడిని అడిగాము. అప్పుడు వాడు "కాకి నల్లగా ఎందుకు ఉంటుందో, కుక్క తోక వంకరగా ఎందుకు ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ నేను చంద్రకళనే ఎందుకు ప్రేమిస్తున్నానో చెప్పటానికి నాకు కారణం ఉంది. చంద్రకళ "అమీబా" బొమ్మ చాలా బాగా వేస్తుంది".

"అమీబా బొమ్మ బాగా వెయ్యటం ఏంటిరా ధరిదృడా.... అమీబా బొమ్మ ఒక నక్షత్రంలాగా ఉంటుంది కదా. ఉన్న బొమ్మల్లో అన్నింటి కన్నా చాలా వీజీగా వేసే బొమ్మ అదే కదా. దానికి కష్టపడటం ఏమి ఉంది రా??" అన్నాను.

మీరంతా ఇంతేరా... "కళ"ను ప్రేమించే మనస్సు అందరికీ ఉండదు రా. Driving చేసేవాడిని Driver అంటే... Drawing వేసేవాళ్ళని Drawer అంటారు కదా. చంద్రకళే నా favourite Drawer. ఇదే విషయం తనకి చెప్పటానికి ఈ శనివారం ఆంజనేయ స్వామి గుడిలో తనని కలుసుకుంటున్నాను" అన్నాడు. వాడు ఏమి చెప్పాడొ మాకు ఏమీ అర్థం కాలేదు.. కానీ వాడు ఆ రోజు రాత్రికి పార్టీ ఇస్తా అన్న విషయం మాత్రం బాగా అర్థం అయ్యింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే లేసి హనుమంతుడిలాగా తయారయ్యాడు. వాడిని చూసి నాకు అనుమానం వేసి ఏ సర్కస్ కీ వెల్తున్నావని అడిగాను.

"వెళ్ళే దేవుడి గుడిని బట్టి వేషం వేసుకొమ్మని మా బాబాయ్ చెప్పాడు రా" అన్నాడు.

"ఒరేయ్!!!! మీ బాబాయ్ ని మీ పిన్ని వదిలేసి ఎన్ని సంవత్సరాలు అయ్యింది రా???" అన్నాను.

"పెళ్ళి ఐన నెల రోజులకే... ఐనా నేను ఎప్పుడూ మా బాబాయ్ గురించి నీకు చెప్పలేదే... అంత కరెక్ట్ గా ఎలా guess చేసావు రా నువ్వు" అన్నాడు.


"అది అంతే... నువ్వు ఇలా తింగరోడివి అవటానికి కారణం ఏమిటా అనుకున్నా... నాకు ఈ రోజు అర్థం అయ్యింది... అక్కడ నీ కోసం చంద్రకళ waiting వెళ్ళు బాబూ... వెళ్ళు" అన్నాను.


అదే వేషంతో గుడికి వెళ్ళి దేవుడుకి చేయవల్సిన ప్రదక్షిన హుండికీ చేసి చంద్రకళకి విషయం చెప్పి ఆమె చేతి వేలిముద్రలు చెంప మీద వేసుకొని వచ్చాడు.


అక్కడ జరిగిన విషయం అందరికీ చెప్పి "failures are stepping stones for success. ప్రేమించే మనస్సు వీళ్లకు అర్థం కాదు రా. పూజారికి ఏమి తెలుసు Peter Scotch పవర్" అన్నాడు. అది విని నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ వాడు ఏదో కొ(చె)త్త విషయం చెప్పినట్టుగా చప్పట్లు కొట్టారు (ఇలాంటి వింత ప్రకటనలు చేస్తాడు కాబట్టే మేము వాడిని తింగరి సిద్దు అని పిలవటం మొదలెట్టాము).

***************************************************************************************************************


"ఒరేయ్ సిద్దూ... నీకు ఇష్టమైన డైరెక్టరు ఎవరు రా???" అని ఎవరైనా అడిగితే..... "నాకు తేజ అంటే చాలా ఇష్టం. అతను తీసిన "ఒక 'V' చిత్రం" సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా ఇప్పటికి 18432753.987843 సార్లు చూసాను" అని సిగ్గు పడుతూ చెప్తాడు. జిందాబాద్.. జిందాబాద్... డైరెక్టరు తేజ.... జిందాబాద్.

***************************************************************************************************************

చెప్పిన ప్లాష్ బ్యాక్ విని ఈ పింజారీ పీనుగు ఇంకా గొంతు పెంచి ఏడుస్తూంటే...... మా ప్రక్క ప్రాజెక్ట్ లో ఉండే RUM బ్యాచ్ (రంభ లో నుండి Rనీ, ఊర్వశి లో నుండి Uనీ, మేనక లో నుండి Mనీ తీసి RUM బ్యాచ్ అని.... నేనే నామకరణం చేసాను) నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు. "ఇంక చేసిన డ్రామా చాలు కానీ.. నీకు కూడా టిక్కెట్టు బుక్ చేస్తాను" అన్నాను.

దీపావళికి టిక్కెట్లు బుక్ చేసి ప్రింట్ తీసి మా సిద్దుగాడికి ఇచ్చి భద్రంగా ఉంచమని చెప్పాను.

మొత్తానికి journey చేసే రోజు వచ్చేసింది. ఆ రోజు నా లగేజి తీసుకొని మా రూములో నుండి బయటికి వెళ్ళేసరికి మా ఇంటి ప్రక్కనుండే రాజనాల నాగభూషణం ఇంట్లో ఉండే నల్ల పిల్లి నన్ను చూసి నవ్వింది. అది చూసి వాడు "మా పిల్లి గొప్పతనం నీకు తెలియదు. ఈ రోజు ప్రయాణం నీ జీవితంలో మరిచిపోవు బాబు" అన్నాడు. "అవునండీ విన్నాను.. మీ నల్లపిల్లి గొప్పతనం గురించి ఢిల్లీలో అందరూ తెలుగులో చెప్పుకుంటున్నారు" అన్నాను.

ఒకసారి నా ఖర్మ రబ్బరు టైరులా కాలి.. నల్లపిల్లిని పెంచటం ఏమిటని వాడిని అడిగాను... దానికి నాకు వచ్చిన సమాధానం.....

"నల్ల, తెల్ల పిల్లి చూడ నొక్కపోలికనుండు
పట్టి, పట్టి చూడ రంగులు వేరు
పిల్లులందు నల్లపిల్లులు వేరయా
విశ్వదాభిరామ ఎలుకను వేటాడి తినునా!!!


నల్ల పిల్లిని పెంచటం ఏంటో... ఎడారిలో ఇసుక అమ్ముకునే ఫేసు వాడూనూ. తిక్క ముదిరి రాజనాల నాగభూషణం అవటం అంటే ఇదే.

అసలే మా సిద్దుగాడితో ప్రయాణం... పైగా ఈ రాజనాల నాగభూషణం గాడి నల్ల పిల్లి నవ్వింది. ఇంక ఈ రోజు జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో అనుకుంటూ బయలుదేరాను.

నేను, సిద్దుగాడు కలిసి రైల్వే స్టేషనుకి వెళ్ళి AP Express ఆగే ఫ్లాట్ ఫాం దగ్గర ఆగాము. మా కన్నా ముందే ఏదో కొత్త సినిమాకి screen test కోసం వచ్చిన హీరోయిన్ల లాగా ఉన్న 50 నుండి 60 మంది అందమైన అమ్మాయిలు train కోసం ఆగి ఉన్నారు. అది చూసిన మా సిద్దుగాడు... కొరివి దయ్యానికి కొబ్బరి దొరికినట్టుగా సంభరపడిపోతూ... వాడి makeup kit తీసి వాడి ముఖానికి ఒక సెంటి మీటరు మేర పౌడరు పూసుకున్నాడు. " ఒరేయ్ సీనుగా.... ఈ రోజు పొద్దున్నే లేసి కృష్ణుడి ముఖం చూడటం బాగా కలిసి వచ్చింది.... నేను ఒంటరిగా 24 గంటలు ప్రయాణం చేస్తున్నానని కరుణించి కరువు ప్రాంతంలో ఉన్నవాడికి ఒకేసారి 50-60 చికెన్ బిర్యానీ పొట్లాలు ఇచ్చినట్టుగా ఇంత మంది గోపికలను పంపించాడు..".

"రావలసిన ట్రైను రాక ఒకడు ఏడుస్తుంటే ఫేసుకు రాసుకోవటానికి Fair & Lovely అడిగాడంటా... ఎవడో వెనకటికి నీలాంటొడు" అన్నాను.

మొత్తానికి మేము ఎక్కే A P Express రావటంతో... వీడి సొది వినే బాధ తప్పింది అనుకొని... "ఓరేయ్ సిద్దూ... నీకు ఇచ్చిన టిక్కెట్లు ఇలా ఇవ్వు... మన సీట్లు ఎక్కడో చూద్దాం" అన్నాను.

"అదేంటి రా... టిక్కెట్లు భద్రంగా ఉంచమని చెప్పావు కదా... అందుకే ఇంట్లో పెట్టి వచ్చాను" అన్నాడు.

"అప్పుడే అనుకున్నా... నువ్వు నా వెంట వస్తుంటే... ఇంకా నా జీవితం మలుపు తిరగటంలేదు ఏంటా అనీ..." అన్నాను. వాడు చేసిన పనికి నాకు వాడిని అదే A P Express క్రిందకి తొయ్యాలని అనిపించింది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి... సరే ఎలాగోలా T.C నీ మానేజ్ చేద్దాం అని రైలు ఎక్కాము.

మేం ఎక్కిన రైలు స్టార్ట్ అవ్వగానే.... T.C వచ్చి నా ప్రక్కన కూర్చొని "బాబు... నీ యొక్క ప్రయాణపు రశీదు చూపిస్తావా" అన్నాడు.

"ఏంటి... ప్రయాణపు రశీదా.... *#*(#@*(#@#@&*^&???" అన్నాను.

"ప్రయాణపు రశీదునే.... టిక్కెట్టు అందురు... మీ దిక్కుమాలిన ఆంగ్లమున. హే శ్రీ కృష్ణదేవరాయా!!!! తెలుగు దేశంలో పుట్టి, తెలుగువారు అయ్యుండీ... ఆ ఆంగ్లపు కూత ఏమిటో.." అన్నాడు.

"మా దగ్గర టిక్కెట్లు లేవండీ....పొరపాటున ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాము" అన్నాను.

"చూడండి బాబు... ధూమశకటమునందు ప్రయాణించుటకు ప్రయాణపు రశీదు కొనుట మీ విధి" అన్నాడు".

"మీరు చెప్పినవి ఏవీ నాకు అర్థం కాలేదు... ఒక్క విధి అనే మాట తప్ప. విధి అంటే E TVలో వచ్చే సీరియల్ కదా" అన్నాడు మా సిద్దుగాడు.

దానికి T.C "నీలాంటి దిక్కుమాలిన వాళ్ళు మాత్రమే అలాంటి ధారావాహికలు చూస్తారు. ఐనా నేను మాట్లాడింది తెలుగు భాషే కదా... అందులో అర్థంకాకపోవటానికి ఏముందీ???" అన్నాడు.

"మీరు నన్ను ఏమైనా అనండీ... అంతే కానీ... E TV సుమన్ నీ, అందులో నటించే ప్రభాకర్ నీ ఏమీ అనకండి. ఆయన తీసే సీరియల్స్ "ఎండమావులు, కళంకిత, పద్మవ్యూహం etc..." ఎంత బాగుంటాయో..." అన్నాడు మా సిద్దుగాడు.

"ప్రభాకర్, సుమన్ రాసుకుంటే... ఇలాంటి ధారావాహికలే రాలుతాయి మరీ..." అన్నాడు "T.C.

అంతలో ఏమయ్యిందో మా సిద్దుగాడికి... బ్యాగులో నుండి టిక్కెట్లు తీసి చూపించాడు... అది చూసిన T.C " ఏడుస్తూ పాడినంత మాత్రాన అది ఏడుపు పాట ఎలా కాదో... పునర్నివేషం అడిగిననత మాత్రాన... పురో పునర్నివేషం మాత్రమే వస్తుందని ఊహించకూడదు (Feedback అడిగిననత మాత్రాన positive Feedback మాత్రమే వస్తుంది అని అనుకోకూడదు). ప్రయాణపు రశీదు చూపించినంత మాత్రాన.. అది ఈ యొక్క ధూమశకటానిదే అవ్వాలని లేదు. ఇలాంటి తిక్క వేషాలు నా వద్ద వేశావంటే.... ఉష్ణగ్రాహక ఘటమునందు ఉడికించెదను జాగ్రత్త... పింజారీ పీనుగా...".

ఏమి పోలికలు చేప్పావు రా నాయనా... ఉష్ణ గ్రాహక ఘటమా.... %$&*$(*))*@. అసలే ఈ T.C నీ ఎలా మానేజ్ చెయ్యాలా అని నేను చస్తుంటే... మా తింగరి సిద్దుగాడు వాడికి ఇంకా పిచ్చెక్కేలా చేస్తున్నాడు. కుక్కని రెచ్చగొట్టి మరీ కరిపించుకోవటం అంటే ఇదే. అయిపోయింది... అంతా అయిపోయింది.... T.C నీ ఎలాగైనా మానేజ్ చేసి టిక్కెట్లు సంపాదిద్దామని అనుకున్న Titanic షిప్ లాంటి నా ఆలోచనకు కావలసిన Iceberg వీడు తయారు చేసేసాడు. అమ్మా!!!! గూగుల్లమ్మ తల్లీ... ఎక్కడున్నావమ్మా... నాకు ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువుని ప్రసాదించి ఈ T.C ని బుట్టలో వేసే మార్గం చూపించు తల్లీ!!!!!!!!!!!!!

***************************************************************************************************************

ఈ అనుభవంతో... పెళ్ళికి వెళ్తూ పిల్లిని వెంటపెట్టుకెళ్ళటం అనేది పాత సామెత... Train Journey చేస్తూ.. తింగరోడిని వెంటపెట్టుకెళ్ళటం అనేది కొత్త సామెత. దీన్ని నా సామెతల పుస్తకంలో నేను ఈ మధ్యనే సరిచేసుకున్నా.

5 comments:

Anonymous said...

హాయ్ శ్రీనివాస్ గారు,
హ హ హ హ .....చాలా బాగా రాసారు....

దేవుడుకి చేయవల్సిన ప్రదక్షిన హుండికీ చేసి .....
ఒకసారి నా ఖర్మ రబ్బరు టైరులా కాలి..

తిక్క ముదిరి రాజనాల నాగభూషణం అవటం అంటే ఇదే...

మీ యొక్క టాలెంట్ ని శంకించే వాళ్ళకు ఇది "కుక్క కాటుకు చెప్పు దెబ్బ".

ఒక సీనుగాడి అభిమాని

Anonymous said...

"రావలసిన ట్రైను రాక ఒకడు ఏడుస్తుంటే ఫేసుకు రాసుకోవటానికి Fair & Lovely అడిగాడంటా... ఎవడో వెనకటికి నీలాంటొడు"

"ప్రభాకర్, సుమన్ రాసుకుంటే... ఇలాంటి ధారావాహికలే రాలుతాయి మరీ..."

"పింజారీ పీనుగా...".



baagunnnai seenu gaaru chaalaa baagundi ee post

aadi sare kaani mee prayaanam emayyindi intakeeee

em chesaaru TC gaaru bolo bolo

అల్లరి తుంటరి సిరి.......... said...

ఈ బ్లాగ్ బాగా రాసావ్..ఈ టపా చదివిన తర్వాతైన నీ మీద అభిప్రాయం మారుతుందని ఆశిస్తునాను...


ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి....

kiraN said...

సీను గారు, మీరు రాసిన ఈ పోస్టులో T.C. పాత్ర మాట్లాడిన తీరు బాగుంది. అది కూడా పూర్తిగా తెలుగులో మాట్లాడటం వల్లనేమో.
మొన్న మధ్యన తోటి బ్లాగర్ ఒకరు మీ బ్లాగు చిరునామా ఇచ్చి చూడమన్నారు. తోట రాముడు బ్లాగుని కాపీ కొట్టినట్టుగా ఉందన్నారు. కాని నేను ఒప్పుకోకుండా మీ శైలి అంతేనేమో అన్నాను.
కాని కొన్ని పోస్టులు చూసాక కాస్త దగ్గరి పోలికలు కనిపించాయి.
అప్పట్నించి మీ బ్లాగుని చూస్తున్నా. ఈ పోస్టు చాలా చక్కగా రాసారు.
ఎప్పటికి ఇలా చక్కగా రాస్తూ ఉంటారని ఆశిస్తూ.

-కిరణ్

Anonymous said...

కిరణ్, లచ్చిమి, తుంటరి కోతి గారు..
మీ ప్రశంసకి ధన్యవాదాలు....

నా ఉనికి ప్రశ్నార్ధకం అవటం వల్ల నేను ఈ పోస్ట్ ని చాలా తొందరగా రాయవలసి వచ్చింది (లేకుంటే.... ఒక నెల తరువాత వ్రాసేవాడినేమో).

ఎప్పటికీ నేను చెప్పదలచుకునేదీ... చెప్పేదీ ఒక్కటే.. తోటు బ్లాగుకి, నా బ్లాగుకి పోలికలు ఉండటం యాదృచ్చికం మాత్రమే... (మనం బాధపడే సన్నివేశాల నుండే హాస్యం సృష్టించగలం... ఆ సన్నివేశాలు కొన్ని మాత్రమే ఉంటాయి.... అందువల్ల పోలికలు ఉండవచ్చు).

ఇట్లు,
ఎప్పటికీ మీ సీనుగాడు (కొంత మంది... అంత సీను లేని సీనుగాడు అని కూడా అంటుంటారు....I hope.. I will answer to them with one more new post sooon)