Saturday, January 26, 2008

అమ్మో.... వీకెండ్

నో.. నన్ను పంపించెయ్యండి.. నేను ఇక్కడ ఉండను అని గట్టిగా కలవరిస్తూ.. నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచాడు మన సీనుగాడు ఉరఫ్ శ్రీనివాస్.. గుర్గావ్ వచ్చి దాదాపు 10 నెలలు కావస్తుంది. బెంగుళూరు పంపిస్తాం అంటారు కానీ అది ఎప్పుడొ చెప్పరు. బెంగుళూరులో ఎవరో ఒకరిని వెతికి పట్టుకొని ప్రాజెక్ట్ లోకి తీసుకు వచ్చి, ఇద్దరు కలసి అక్కడి నుండి పని చేస్తా అంటే పంపిస్తాం అంటున్నారు. అది జరగటం కాదు అని అనిపిస్తుంది.. ఇలా నిద్రలో నుండి ఉలిక్కి పడి లేచి పడటానికి కారణం.. వీకెండ్.. అవును నిజంగానే వీకెండ్. ప్రతీ సాప్ట్వేర్ ఇంజనీర్ లాగే నేను కుడా వీకెండ్ కోసం ఎదురు చూసే వాడినే...కానీ ఇప్పుడు వీకెండ్ అంటెనే.. అది ఎదో హార్రర్ సినిమాలాగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని నెలల ముందు వీకెండ్ అంటే.. ఎంజాయ్ చెయ్యటం. కానీ ఇప్పుడు.. అది ఒక గుండెని పిండి జ్యూసు చేసి తాగుతున్నంత బాధ (సెంటిమెంటు కోసం వాడాను అంతే).
**********************************************************************************************
స్థలం : బెంగుళూరు
సమయం : ఎదో ఒకటి రాసుకోండి
కొంచెం పనిలో ఉన్నప్పుడు (నిజంగానే పనిలో ఉన్నానండీ బాబు ) ఫోన్ రింగ్ అయ్యింది... "నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెపుతున్న.." రింగ్ టోన్. ఎవరా అని చూస్తే.. ఐదు పైసల ముఖం చందుగాడు (మేము అలాగె పిలుస్తాం.. ఎందుకంటే వాడి ముఖం అలాగే ఉంటుంది), అప్పుడే అనుకుంటున్నా ఎమిటి ఇంకా వీడు ఫోన్ చెయ్యలేదు అని... "చెప్పు రా చందు అని అనగానే... ఇప్పుదే సాగర్ గాడికి ఫోన్ చేసాను వాడు సాయంట్రం 7 గంటలకి నీ రూం కి వస్తా అని చెప్పాడు, అలాగే మన అర గుండు దివాకర్ గాడు కూడా వస్తా అని చెప్పాడు. నేను కుడా వస్తా...." అని పెట్టేసాడు. ఇదీ మాకు ప్రతీ శుక్రవారం ఉండేదే... ఇది అంతా.. వీకెండ్ ప్లాన్. ఇక శుక్రవారం మొదలు అయ్యే మా కుంభమేలా (మేము ప్రతి వీకెండ్ చేసుకునే పండగ.. .మేము అలాగే పిలుస్తాము). అలా శుక్రవారం మొదలైన మా పండగ సోమవారంతో ముగుస్తుంది... ఇలా మూడు రొజులు తాగింది దిగాటానికి...తిన్నది అరగటానికి సోడాలు గట్రా తాగి.......మళ్ళీ తరువాత వీకెండ్ కి ప్లాన్లు వేస్తూ... ఆఫిసుకి వెళ్తాం.
***************************************************************************************
స్థలం : గుర్గావ్(నా బాషలో నరకం... మీకు నచ్చింది మీరు రాసుకోండి)
సమయం : సుమారుగా గత 10 నెలల నుండీ ఇక్కడే ఉంటున్నా.. కాబట్టి, సమయంతో పని ఏమి ఉంది
ఒక రెండు మూడు వారాలు బీచ్లో (మా కంపెనీలో బెంచ్ ని ఇలాగే పిలుస్తాం) ఉండే సరికి పిచ్చి ఎక్కిపొయింది..ఇలా కాదు కానీ..ఎదో ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోవాలి అని అనుకొనగానే.. ఒక ప్రాజెక్ట్ లో ఒకరికి ఖాళి ఉంది అనగానే.. కొతికి కొబ్బరి దొరినంత సంబరపడిపొయాను, కానీ అది గుర్గావ్(ఢిల్లీ దగ్గర) అని అనగానే.. సరేలే నార్త్ ఇండియా చూసినట్టుగా ఉంటుంది అని OK చేప్పేసా.(కానీ తన జీవితం స్టాలిన్, ఒక్క మగాడు సినిమాలలోని మలుపుల కన్న గొప్ప మలుపు తిరుగుతుంది అని తెలియదు పాపం. మన సీను గాడికి ... అంటే ఎవరో అనుకునేరు... నేనే).
ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడ ఉన్న facilities అన్ని చూసి, నాలో నేను, "అనుభవించు రాజా" అని పాట పాడుకున్న. కొన్ని రోజుల తరువాత "ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను" అని పాడుకోవలసి వస్తుంది అని అనుకోలేదు.
ఇక్కడికి వచ్చే ముందు... ఇక్కడికి వచ్చిన కొత్తలో.. ఇక్కడి అన్ని visiting places చూద్దాం అని అనుకున్నా.. కానీ.. ఇక్కడికి వచ్చిన తరువాత తెలిసింది, ఇక్కడి transport ఎంత దరిద్రమో.. ఇక్కడి నుండి ఎటు వెళ్ళాళి అన్నా.. రిక్షానే గతి.. నేను చేప్పేది నిజమండీ బాబు.. ఎంత నిజం అంటే.. స్టాలిన్, ఒక్క మగాడు సినిమాలు box office హిట్లు అన్నంత నిజం. (కావాలి అంటే.. ఆ సినిమాల నిర్మాతలని అడగండి, అప్పటికీ మీకు డౌట్ గా ఉంటే, దగ్గరలోని డాక్టరుని సంప్రదించ వలసిందిగా నా మనవి ).
అప్పటికీ.. బయటికి వెళ్దామని అనుకున్నమా... అలా రోడ్డు వెళ్ళగానే.. రిక్షాలు అన్నీ ఒక లైన్లో ఉంటాయి.. మనం వెళ్ళగానే....ఆ రిక్షా వాడు హిందీలో, "కిదర్ జానా హై సాబ్" అంటాడు.దీనినే తెలుగులో, "నేనే రా నీకు దిక్కు.. ఇవ్వాళ నీకు గుండే...ఈ చుట్టు పక్కల నీకు ఎక్కడ వెతికినా, బస్, ఆటో కానీ ఏదీ దొరకదు". అలా చచ్చీ, చెడీ అన్ని రకాల బస్సులు, ఆటోలు ఎక్కి ఎక్కడికి ఐనా వెళ్ళామో.. మళ్ళీ వెనక్కి తిరిగి రావటం కన్నా.. అక్కడే ఉండి పోవాలి అనిపిస్తుంది, ఎందుకంటే, రావటం ఇంకా కష్టం. అలా బయటికి వెళ్ళే ముందు, మంచి తెల్లటి డ్రెస్ వేసుకున్నామో, ఇంక అంతే, ఇక్కడ దుమ్ముకీ వేసుకున్న ఐదు నిమిషాలకి అది నల్లగా మారకుంటే, నేను వాడే surf excel మీద ఒట్టు. అందుకే, నేను ఈ placeకి ఒక కొసరు పేరు తగిలించా, అది "గుర్గావ్ - సిటీకీ తక్కువ ఏడారికి ఎక్కువ" .
సరే, బయటికి ఎలాగు వెళ్ళటం కష్టం అని అనుకున్న తరువాత (అంటే.. పట్టువదలని విక్రమార్కుడిలాగా కొన్ని సార్లు వెళ్ళి వచ్చిన తరువాత), TV చూసి వీకెండ్ అయిపోగొడదాం అని అనుకున్నాను. అలా అనుకోవటం నా జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది అనుకోలేదు. ఒకసారి ధైర్యం చెసి TV చూడటం మొదలు పెట్టాను. ధైర్యం అని ఎందుకు అన్నాను అంటే, నేను ఉండే కంపనీ guest houseలో ఒకే ఒక తెలుగు చానెల్ వస్తుంది, అది కూడా.. తెలుగు వాడు అయి పుట్టిన వాడు ఎవడూ కూడా చూడని మహత్తరమైనది, ఇంక అనుమానం ఎందుకూ అది మన E TV. ఒక రెండు మూడు వారాలు అది చూసాకా.. అందులో వచ్చే programs కన్నా, నా చిన్నప్పుడు, DD 1లో (దానినే మనం అందరం, ప్రేమతో దూలదర్షన్, క్షమించాలి... దూరదర్షన్ అనే వాళ్ళాం) వచ్చే పందుల పెంపకం బాగుంటుంది అని. ఎందుకంటే అది ఒక అర గంట మాత్రమే వచ్చేది, కానీ ఇందులో వచ్చే సీరియల్స్ ఎన్ని సంవత్సరాలు అయిపోవు.. ఐన నా పిచ్చి కానీ, మనల్ని చంపటానికే కదా అవి పుట్టింది.
ఇక్కడ ఉన్న PVR ఇంకా Malls వాళ్ళకి, రజనీకాంత్, చిరంజీవి తప్ప వేరే south indian హీరోలు తెలియదు. అందుకే కొత్త తెలుగు సినిమాలు చూడటం ఎప్పుడొ మానేసా(ఐనా.. ఈ మధ్య అన్ని box office హిట్లే కదా మన తెలుగులో.. ఇది నిజం అని నమ్మిన వాళ్ళు సమీప డాక్టరుని సంప్రదించ వలసిందిగా మనవి ).
బెంగుళూరులో వీకెండ్ నీ, ఇక్కడి వీకెండ్ నీ పోల్చి .. అన్నీ గుర్తుకు వచ్చి.. కళ్ళలో నుండి.. మేము అందరం తాగిన... బీర్లు, విస్కీ(దీనినే మేము దగ్గుమందు అని కూడా అంటాం....), సోడలు, జ్యూసులు కారుతున్నాయి..
ఈ అనుభవంతో... గుర్గావ్ లో బ్రతికిన వాడు, ఆఫ్రికా అడవుల్లో, సహరా ఎడారిలో కూడా బ్రతకగలడు అని నా డైరీలో ఎప్పుడొ రాసుకున్నా..