Friday, November 7, 2008

బ్రహ్మచారి జీవితం


బ్రహ్మచారి జీవితం గురించి చాలా మంది ఇప్పటికే చాలా బ్లాగర్లు చాలా రకాలుగా రాసే ఉంటారు (నేను ఈ బ్లాగు లోకానికి కొత్త కాబట్టి..... ఎవరు రాసారో నేను ఇక్కడ రాయలేకపోతున్నా).. కానీ నాకు కూడా నా అనుభవం గురించి
రాయాలని అనిపించింది. ఎందుకంటే... బ్రహ్మచారిగా అది నా జన్మహక్కు.

ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్య... బ్రహ్మచారులకు ఇల్లు ఇవ్వకపోవటం... అదే నా ఆవేదన... సగటు బ్రహ్మచారి ఆవేదన. ఎన్నో ఖాళీ గదులున్న ఇంటి యజమానులు బ్రహ్మచారులకు గది ఇవ్వమని చెప్తుంటే వాళ్ళు పడే ఆవేదన నాకు తెలుసు. ఇప్పటి ఇంటి యజమానులు కూడా ఒకప్పటి బ్రహ్మచారులే అని ఎందుకు గ్రహించరు???.

బ్యాచిలర్స్ కి రూము ఇస్తే...

1. ఇంటి యజమానికి భయం..... ఒకటో తారీఖు కల్లా అద్దె కడతాడొలేదో అని.... (ఒక వేళ అద్దె ఇవ్వమని అడిగితే స్నేహితులని తీసుకొచ్చి ఇరగ కుమ్మేస్తాడేమొనని)

2. ఇంటి యజమానికి మంచి అందమైన భార్య ఉంటే ఇంకా భయం... ఎక్కడ తన భార్యకి బీటేస్తారేమోనని..

3. అందమైన కూతుళ్ళున్న ఇంటి యజమానికి ఇంకా భయం... ఎక్కడ తన కూతుళ్ళని లేపుకుపోతారేమోనని...

4. బ్యాచిలర్స్ దిగిన రూము ఎదురుగా ఉండే కొత్తగ పెళ్ళైన జంటకి ఇంకా భయం.....

5. అమాయకపు ఇంటి యజమానికి ఇంకా భయం... ఒక వర్షం కురవని weekend ఎక్కడ "కుంభమేళ" చేసి తన చేత "రాంబాబు" క్యారెక్టరు వేయిస్తారేమొనని...

6. ఇంటి ప్రక్కన బార్ లేకపోతే... ఇంటి యజమానికి ఇంకా భయం... ఎక్కడ తన ఇంటినే బార్ లాగా మార్చేస్తారేమొనని...

7. వంటరాని బ్యాచిలర్స్ అంటే భయం.... ఎప్పుడు చూసినా తన ఇంట్లోనే పడి మేస్తారేమొనని...

8. వంట వచ్చిన బ్యాచిలర్స్ ఐతే ఇంకో భయం.... వంట పేరుతో తన ఇల్లంతా తగలబెట్టటమే కాకుండా.... వండిన వింత వింత వంటలన్నీ తనతోనే తినిపిస్తారేమొనని...

ఈ పైన చెప్పిన కారణాలన్నీ చెప్పి... 3/4 బెడ్రూముల దగ్గర నుండి సింగిల్ రూము సెట్ ఉన్న ఇంటి యజమానుల వరకు మాలాంటి బ్యాచిలర్స్ కి అద్దెకు రూములు ఇవ్వకపోతే.... సగటు బ్యాచిలర్ తన జీవితాన్ని ఏ ఫుట్ పాత్ల పైన గడపాలి....

ఒక్కసారి బ్రహ్మచారి బోడిగుండు బ్రహ్మానందం గారు చెప్పిన "బ్రహ్మచారి పురాణం" గుర్తుచేసుకుందాం... "ఎక్కడ బ్రహ్మచారి కి అడిగిన వెంటనే గది అద్దెకు ఇవ్వబడుతుందో... ఎన్ని "కుంభమేళాలు" చేసినా ఇంటి యజమాని ఏమీ అనడో... ఇంటిని చెత్తకుండిలా చేసినా కిక్కురుమనకుండా ఉంటాడో... అట్టి చోటికి నా తోటి బ్రహ్మచారులను తీసుకెళ్ళు". అందుకే ఇది చూసి తట్టుకోలేకే BAP (Bachelor Accomodation Provider) అనే సంస్థను స్థాపించాలని అనుకుంటున్నాను. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే.