Tuesday, July 8, 2008

ఆ మూడు రోజులు....


********************** ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యింది ******************

దినం, సమయం : 1988, రెండవ తరగతి గది

మాస్టారు : ఒరేయ్ సీను, కాలాలు ఎన్ని రకాలో చెప్పు.

సీను గాడు : మరే... మరేమోనండీ... కాలాలు మూడు రకాలండీ. భూత కాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. భూత కాలం అంటే.. భూతాలు, దెయ్యాల కాలం కాదండీ, జరిగిన కాలంలో ఎవడెవడికి మూడిందో చెప్పేది. వర్తమానం అంటే జరుగుతున్నదీ మరియు భవిష్యత్ కాలం అంటే.. ముందు ముందు ఎవడికి మూడుతుందో చెప్పేది. అలాగే రుతుపవన కాలాలు కూడా మూడేనండీ. వర్షా కాలం, ఎండా కాలం మరియూ చలి కాలం.

********************** ఫ్లాష్ బ్యాక్ ముగిసింది **********************

కాలాలు మూడు.. అవి భూత, భవిష్యత్ మరియు వర్తమాన కాలాలు. ఇంకో కాలం కూడా ఉంది... అది పోయే కాలం. అది ఎప్పుడు, ఎలా, ఎవరికి వస్తుందో... ఎవరికీ తెలియదు.

మొన్నీ మధ్య నేను పని చేసే ప్రాజెక్ట్ కి సెలవు ఇచ్చారు అది కూడా weekendతో కలిపి. సరేలే..... మూడు రోజులు సెలవులు వచ్చాయి కదా అని... కులు, మనాలి విహారయాత్రకి అంతా సిద్దం చేశాం. అప్పుడే, మా NCR (నరకపు Capital Region).. క్షమించాలి National Capital Region మీద ఆ వరుణ దేవుడికి చాలా ప్రేమ కలిగింది (ఢిల్లీ, గుర్గావ్ మరియూ నోయిడాని కలిపి NCR (National Capital Region) అంటారు). అందుకే రెండు రోజులు వర్షం, ఎండ కలిపి వచ్చేలా చేశాడు. ఇక్కడ రుతుపవన కాలాల గురుంచి వచ్చింది కాబట్టి చెపుతున్నా... అప్పుడు ఆ పుస్తకం రాసినవాడికీ, చెప్పిన మా మాస్టారికీ ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల గురుంచీ తెలియదు అనుకుంటా... లేకుంటే రుతుపవన కాలాలు రెండే అని చెప్పేవారు. నిజమే.... గుర్గావ్ లో వుండే వాళ్ళకి రెండే కాలాలు.. అవి, చలి కాలం మరియు ఎండా కాలం. ఇంతకు ముందు చెప్పినట్టు వానా కాలం వస్తుంది కానీ అది వచ్చినట్టే ఉండదు. చలి కాలం ఎలా ఉంటుంది అంటే... ఇంట్లో నుండి బయటికి రావాలనీ కూడా అనిపించదు. చలి కాలంలో అప్పుడప్పుడూ temparature 1 డిగ్రీకి కూడా పడిపోతుంది. ఇంక ఎండా కాలంలో ఎంత బాగా ఉంటుందో.... చెప్పటానికి భాష లేదు, రాదు కూడా... అంత బాగా ఉంటుంది (నిజమే అనుకున్న వాళ్ళు దగ్గరలోని డాక్టరుని కలవవలసిందిగా నా ప్రార్ధన). ఎండా కాలంలో A/c, cooler, fanలు తిరుగుతూనే ఉంటాయి కానీ చెమటలు వస్తూనే ఉంటాయి. అందుకనే ఇక్కడి వాళ్ళు చెమట తూడుచుకోవటానికి కర్చీఫ్ లాంటివి వాడరు... వాడరూ అంటే దాని అర్థం అవి వాడరు అని ... దాని బదులు ఒక పెద్ద టవల్ వాడతారు. ఇంక ఈ కాలంలో ఒక మంచి తెల్ల షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళామంటే దానికి పట్టిన చెమట పోవాలీ అంటే కనీసం రెండు రోజులు ఉతకాలి. అందుకనే ఇక్కడికి వచ్చిన తరువాత తెల్ల షర్ట్ వేసుకోవటం నేను ఎప్పుడొ మనేశాను. లేదు.. నేను వేసుకుంటా అని పట్టు వదలని విక్రమర్కుడులా వేసుకుని బయటికి వెళ్ళారంటే అందరు మనల్ని ఎర్రగడ్డ నుండో లేక nimhan's (బెంగుళురులోని పిచ్చాసుపత్రి) నుండొ పారిపోయి వచ్చాము అనుకుంటారు.

ఇంతకు ముందే చెప్పాను కదా.. వర్షం పడుతుందీ అనీ.... కానీ అది ఎలా ఉంటుందీ అంటే... వర్షం పడిన ఒక గంటకి మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక సారి ఇది తెలియక ఇలాగే.. వర్షం పడినప్పుడు నా స్నేహితుడిని ఒకడిని పట్టుకొని ఏంటి.. వర్షంలో తడిసి వచ్చావా అని అడిగాను. వాడు "ఒరేయ్ సీనుగా నేను చెమటలో తడిసి ఇలా అయ్యి ఉంటే నీకు ఆటలుగా ఉందారా.. నా కొడకా" అని అన్నాడు. అలా ఉంటుంది, వర్షం పడిన ఒక గంట లోపే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒక సారి వర్షం పడినప్పుడు నేను నా స్నేహితుండు కలిసి బయటికి వెళ్ళాము. అక్కడ అంటుకున్న బురదను వదిలించుకుంటూ.. వాడిని చూస్తూ ఏంటిరా ఇదీ అని అడిగాను. ఇంక అంతే వాడిలోకి ఒక శ్రీ కృష్ణుడు వచ్చేసి... "ఆత్మ ఒక దేహమును వదలి ఇంకో దేహమును ఎలా చేరుతుందో... అలాగే, బురద కూడా ఒకరిని వదిలి ఇంకొకరిని చేరుతుంది. ఏ బురద ఐతే అంటుకున్నచో.. వదలదో అట్టి బురద చాలా గట్టిదని చెప్పబడును. అట్టి బురద ఒక్కసారి అంటుకున్నచో వదిలించుకొనుట చాలా కష్టం. బురదను నువ్వు వదిలించు కున్నావని అనుకుంటున్నావు కాని, అది అంతా నీ భ్రమ. ఆ బురద నిన్న ఒకరికి అంటుకుంది, ఈ రోజు నీకు అంటుకుంది, రేపు ఇంకొకరికి అంటుకుంటుంది. అట్టి దాని గురుంచి చితించుట తగదు. బురదే సత్యం, బురదే నిత్యం. ఇప్పటితో ఈ బురద పురాణం సమాప్తం" అన్నాడు.

అలా అన్ని కష్టాలు పడి బురదలో బయటికి వెళ్ళటం ఎందుకని..... ఆ మూడు రోజులు TV చూస్తూ గడిపెయ్యాలని ఒక నిర్ణయం తీసుకున్నా. ఇంక అది మొదలు....

పొద్దున్నే మన మహత్తరమైన E TVలో కొత్త తెలుగు సినిమా వేసాడు. కొత్త అంటే... తెలుగు సినిమా పుట్టిన కొత్తలోది అని అర్థం. పోనీ Gemini చూసి తరిద్దం అనుకుంటే... అన్నీ అరవ డబ్బింగు సీరియళ్ళు వేసాడు. అలా పెట్టగానే.... ఆనందం... ఇది ఆనందం అనే సీరియల్ వేసాడు.. ఆ ఆనందం సీరియల్ నా ఆనందాన్ని హరించేసింది. అలా ఆ "కొత్త" సినిమా అయిపోగానే.. ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు మీరు "రుచి అడ్డమైన రుచి.... క్షమించాలి... రుచి అభిరుచి అనే ఒక వింత వంటలను తయరు చేసే కార్యక్రమం చూస్తారు. దయచేసి ఈ కార్యక్రమంలో చూపించిన విధంగా వంటలు తయారు చేసి తిని ఆసుపత్రి పాలు అయినచో దానికి మేము భాద్యులము కాము" అని చెప్పింది.

అలా ఆ కార్యక్రమం ప్రారంభం కాగానే అక్కడున్న TV యాంకరు ఆ రోజు వంట చెయ్యటానికి వచ్చిన అతిధి గురించి చెప్తూ "ఈ రోజు మనం కలవబొతున్న అతిధి పేరు దుర్గ గారు. వీరి గురుంచి చెప్పాలీ అంటే.. ఈమే మాములుగా వంట చెయ్యరు, ఇలాంటి కార్యక్రమాలలో తప్ప. ఇంట్లో వంటలన్నీ వీళ్ళ ఆయనగారే చేస్తారు. ఇప్పుడు దుర్గ గారు చేసే ఈ వింత వంటకం చూద్దాం". చెప్పండి దుర్గ గారు.. ఈ రోజు మీరు చేసే వంటకం పేరు ఏంటి???. "ఈ రోజు నేను చెయ్యబోయే వంటకం పేరు "old is gold". దీనికి ఆ పేరు ఎందుకు పెట్టాను అంటే.. దీనికి కావలసినవి అన్నీ కనీసం రెండు, మూడు రోజులవి అయ్యుండాలి. అంటే మూడు రోజుల కింద కొన్న కూరగాయలు, పాలు etc అన్నమాట. ఇంకొంచెం పాతవి ఐతే ఇంకా మంచిది". అని ఏమేమో చేసి ఒక వింత వంటకం ఆ TV యాంకరు చేతిలో పెట్టి ఇంకా ఏదో చెప్పేలోగానే ఆ యాంకరు ఆ వంటకం తిని కింద పడిపోయింది. అప్పుడు ఆ దుర్గమ్మ తల్లి " దీని కక్కుర్తి తగలెయ్యా... మొత్తం చెప్పే వరకు వినకుండా తినేసింది. ఈ యాంకరులు అంతా ఇంతే... మనం చెప్పింది అసలు వినరు. ఆ వంటంకం, మన ఇంటికి వచ్చిన అతిధులను పారిపోయేట్టు చెయ్యటానికీ, మనం తినటానికి కాదు".

అది అయిపోగానే "పాడనా.... పారిపోయేట్టు" అనే singing competetion మొదలైంది. హమ్మయ్య మంచి talent ఉన్న singers పాడే పాటలు వినొచ్చు అని అనుకున్న. మొదటగా ఒక singer వచ్చి శంకరాభరణం సినిమాలోని పాట పాడబొతున్నా అని అనగానే... ఆహా ఏమి నా భాగ్యం... నాకు నచ్చిన సినిమాలోని పాట వినొచ్చు అనుకుని TV volume పెంచాను. ఆ పాట మొదలైన కొద్ది సేపటికి చూసుకుంటే.... నాకు బాగా చెమటలు పట్టేసి, గుండె దడ మొదలైంది. పైకి తలెత్తి చూసా... fan తిరుగుతూనే ఉంది. ఏంటీ ఇంత చెమటలు పట్టాయి అని చూస్తే... TVలో అతను పాడుతున్న పాట మహిమ అని తెలిసింది. అంత మంచి పాటను అలా పాడుతుంటే వింటున్నందుకు నాకు ఎక్కడ కాశీలో గోవును చంపితే వచ్చే.. గోహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అని భయమేసింది. ఆ తుఫాను వెలిసి నేను కొంచెం తేరుకునే లోగానే.... "నవ్వుతావా..లేక చస్తావా" అనే నవ్వుల కార్యక్రమం మొదలైంది. హమ్మయ్య, కాసేపు నవ్వుకొవచ్చు అనుకున్న. అలా కొద్ది సేపు చూసిన తరువాత.... నా కళ్ళలో నుండి నీళ్ళు రావటం మొదలైంది (అవి "ఆనంద" కన్నీరు అనుకుంటే ఆ "నవ్వుతావా..లేక చస్తావా" కార్యక్రమాన్ని మీరు చూడవల్సిందిగా నా ప్రార్ధన). ఇది చూస్తుండగానే "ఇంకొంచెంసేపు TV చూడు, నువ్వు ఒక అద్భుత అనుభూతికి లోనవుతావు" అని వినిపించింది. చుట్టూ చూసాను... ఎవరూ లేరు... ఏదో నా భ్రమ అనుకొనీ మళ్ళీ TV చూస్తూ ఏడవటం మొదలుపెట్టా.... ఇప్పటికే అన్నీ రకల హత్యలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న నేను, ఇంక ఎందుకు బ్రతికే ఉన్నాను రా... బాబు అనుకుంటుండగా... ఒక యాంకరు వచ్చి "ఇప్పుడు మీరు, విశ్వ విఖ్యాత నటనా సార్వభౌముడు NTRని మించిన నటన... S.P.బాలసుబ్రమణ్యం, యేసుదాసు etcలని మించిన గాన గాంధర్వుడు... సిరివెన్నెల సీతారామశాస్త్రిని మించిన పాటల రచయిత, త్రివిక్రం శ్రీనివాస్ ను మించిన మాటల రచయిత ఐన సుమన్ గారు... అన్నీ తానే అయి.... నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా... నికృష్టుడి పాత్ర... క్షమించాలి... కృష్ణుడి పాత్ర పోషించిన "బలరామ కృష్ణయుద్దం" సీరియల్ చూడబోతున్నారు.. చూడండీ... చూసి తరించండీ" అని చెప్పింది.

అనుకోకుండా... మా ఇంట్లో కరెంటు పోయింది. హమ్మయ్య అనుకున్నాను. ఇంతకు ముందు ఎన్నో సార్లు కరెంటు పోయినప్పుడు "ఛీ... వెధవ కరెంటు ఇప్పుడే పోవాలా??? అని అనుకునే వాడిని.. కానీ ఆ రోజు మాత్రం చాలా ఆనందం అనిపించింది. ఆ రోజు మా ఇంట్లోకి చీకటి వచ్చి... నా జీవితంలోకి వెలుగును నింపింది.

తగిలిన దెబ్బకి Dettol రాస్తుంటే ఉండే మంట.... ఒక రోజు మొత్తం ఉంటే ఎలా ఉంటుందో... అప్పుడే నాకు తెలిసింది.